అంకాలమ్మ చెరువులో ఆక్రమణల జోరు | - | Sakshi
Sakshi News home page

అంకాలమ్మ చెరువులో ఆక్రమణల జోరు

Jul 28 2026 1:54 AM | Updated on Jul 28 2026 1:54 AM

బోర్డు ఉన్నా లెక్కచేయడం లేదు

ఆక్రమణలు అడ్డుకుంటాం...

కలకడలో కాలువలు మాయం

నిద్రావస్థలో రెవెన్యూశాఖ అధికారులు

కోర్టులో ఉన్నా తేలని లెక్కలు

కలకడ : కలకడలో ఆక్రమణలకు హద్దులేకుండా పోతోంది. అధికారి మన మాటవింటే చాలు రికార్డులు ఎక్కడ ఉన్నా భూమి మనదే అన్నట్లు కలకడ అంకాలమ్మ చెరువు, సిద్దేశ్వరస్వామి ఆలయం చెరువు కాలువను ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నట్లు మండల కేంద్రమైన కలకడలోని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నారు. చెరువులు, కాలువలు, ఆలయ భూములు సైతం ఆక్రమణలకు గురవుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొంతమంది బడా నాయకులు చెరువుమట్టిని ఎత్తి వేసి ఇంటి స్థలాలుగా ప్లాట్లు వేస్తున్నారని వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. చిత్తూరు –కర్నూలు జాతీయ రహదారి ఆనుకుని ఉన్న కలకడ అంకాలమ్మ చెరువు రెవెన్యూ రికార్డుల మేరకు 27 ఎకరాల 50 సెంట్లు ఉన్నట్లు రెవెన్యూ శాఖ అధికారులు తెలిపినా సగం చెరువు ఆక్రమణకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. దరఖాస్తు పట్టాలు ఉన్నట్లు కొందరు, కొనుగోలు చేసినట్లు మరికొందరు చెరువు పక్కన సర్వే నెంబర్లు చూపి చెరువును ఆక్రమించి ఇంటి స్థలాలకు విక్రయించడానికి సిద్ధపడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆక్రమిస్తే అనుభవ పట్టా

మొదట స్థలం ఆక్రమిస్తే చాలు, రాత్రికి రాత్రి రేకులషెడ్డు, అనంతరం సెలవు రోజుల్లో పునాది, ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారి ఆనుకుని ఉండటంతో మొదట స్థలంలో పాగా వేసి తర్వాత సొంతం చేసుకుంటున్నారు. కలకడ అంకాలమ్మ చెరువులో నిర్మాణాలు చేపట్టిన వారికి గతంలో అనేక మార్లు రెవెన్యూశాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ ఆక్రమణలు తొలగించలేకపోయారు. నిర్మాణం చేపట్టే సమయంలో నిలువరించలేకపోతే చాలు ఎవరూ అడ్డుకోలేరు అనే చందంగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి.

కోర్టులో స్టే తీసుకుంటే చాలు

చెరువు, కాలువలు ఆక్రమణకు గురైనా పూర్తిగా తొలగించిన దాఖలాలే లేవు. హడావుడి అంతా ఒక్క రోజే. మరుసటిరోజు మామూలే. నివేదికలకే పరిమితం. చెరువులు, కాలువలు, ఆలయ భూములు, చెరువు మనుగడ భూములు రెవెన్యూ రికార్డులకే పరిమితమయ్యాయి. కోర్టులో స్టే తీసుకుంటే సరిపోతుంది అనుకునే ఽవారు అధికమయ్యారు.

అంకాలమ్మ చెరువును సుందరీకరించాలి

మండల కేంద్రమైన కలకడ ఆనుకుని ఉన్న అంకాలమ్మ చెరువును పూర్తిగా సర్వే చేసి ఆక్రమణలు తొలగించి చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడితే కలకడ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు చెరువును కాపాడినట్లు అవుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అధికమౌతున్న ఆక్రమణలు

అంకాలమ్మ చెరువులో చెరువుబండ నుంచి ఆక్రమణలు జరిగినట్లు అనేక మార్లు ఫిర్యాదులు అందినా నివాసులకు కూడా పట్టాలు మంజూరు కాలేదు. సాగుభూమి ఆయకట్టు దారులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. 2018లో అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు, 2022లో జిల్లా కలెక్టర్‌కు కలకడ తహాసీల్దార్‌ వారికి ఫిర్యాదులు చేసినా ఆక్రమణలు జరగలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని నివేదికలు పంపారు తప్ప ఆక్రమణలు పూర్తిగా తొలగించిన దాఖలాలు లేవు. చెరువు మరింత ఆక్రమణకు గురవడంతో సోమవారం అన్నమయ్య జిల్లా వైఎస్సార్‌ సీపీ నాయకులు షావత్‌అల్లిఖాన్‌, పీలేరు నియోజకవర్గ మైనార్టీ సంఘం అధ్యక్షులు మస్తాన్‌ అహమ్మద్‌, నాయకులు సద్దాం, నాయకులు ఆక్రమణలపై కలకడ తహసీల్దార్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు.

చెరువులు, కాలువలు ఆక్రమణకు గురైతే అడ్డుకుంటామని, గతంలో హెచ్చరిక బోర్డులను అంకాలమ్మ చెరువులో ఏర్పాటు చేశాం. కాలువలు, కబ్జా స్థలాలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. రీ సర్వే జరుతుంది. మండలంలోని అన్ని పంచాయతీలలో రీ సర్వే పూర్తి కాగానే ప్రభుత్వ భూ ములు, చెరువులు, ఆక్రమణదారులపై చర్యలు తప్పవు. అంకాలమ్మ చెరువు, కాలువలు పరిశీలించి ఆక్రమణలపై జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపుతాం. ఆక్రమణలకు అడ్డుకట్టవేస్తాం.

– మహేశ్వరిభాయ్‌, తహసీల్దార్‌, కలకడ

2018లో జాయింట్‌ కలెక్టర్‌, కలకడ రెవెన్యూశాఖ అధికారులు ప్రభుత్వ స్థలంగా బోర్డు ఏర్పాటు చేశారు. ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ నేడు బోర్డు ఉన్నా మట్టి మాత్రం చదును చేశారు. చెరువులోకి ఇతరులకు ప్రవేశం లేకుండా జెసీబీతో కాలువ తీశారు. కలకడ ప్రభుత్వ పశువుల ఆసుపత్రికి ఉన్న దారికి కంచె వేశారు. కలకడ రెవెన్యూ శాఖ కార్యాలయం ముందు ఉన్న కాలువ కలకడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుంచి సత్యవతి నదిలోకి వాననీరు చేరే కాలువ ఉన్నా పూర్తి ఆక్రమణకు గురైంది. జాతీయరహదారిపై ఉన్న కల్వర్టులు సైతం పూడ్చివేసి చదును చేస్తున్నా రెవెన్యూ కార్యాలయం ముందు ఆక్రమణ జరుగుతున్నా ఎవరూ అపడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఆక్రమణలపై తహసీల్దార్‌కు సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసినట్లు స్థానికులు తెలిపారు. పంచాయతీ స్కీంబోర్‌కు ఏర్పాటు చేసిన స్టాటర్‌, విద్యుత్‌ సర్వీసులు కూడా ఆక్రమించి, తొలగించినట్లు పంచాయతీ అధికారులు, సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement