సాక్షి అన్నమయ్య : రాజన్న... ఈ మాట ఉచ్చరిస్తేనే జనాలకు ఒక భరోసా. ఇంట్లో ఏది జరిగినా నీకు నేనున్నానంటూ ఆయన అందించిన విశ్వాసం కుటుంబంలో నేటికీ శాశ్వతం. ప్రత్యేకించి అందుకు కారణం రాజకీయాలకు అతీతంగా పేదల్ని ప్రేమించడం, వర్గాలకు అతీతంగా సంక్షేమ పాలన అందించడం. చెరగని చిరునవ్వుతో... తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టే... నడకలో రాజసం... నమ్ముకున్న వారిని ఆదరించే గుణం... మాట తప్పని మడమ తిప్పని నైజం... కార్మికులు, కర్షకుల కోసం పరితపించే గుణం... ఈ లక్షణాలన్నీ కలగలిపిన ఏకై క నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజానీకంతోపాటు ప్రపంచ తెలుగు ప్రజలకు సుపరిచితుడు. ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నే తెచ్చిన నాయకుడాయన. రాష్ట్ర ప్రజల కోసం, ఎంతటి కష్టాన్నైనా భరించారు. ఎలాంటి పన్నులు విధించకుండా ఐదేళ్లు సంక్షేమ పాలన అందించి ఆదర్శంగా నిలిచారు. బుధవారం వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
ఝరికోన ప్రాజెక్టు పూర్తి
బ్రిటీష్ కాలం నుంచి ప్రచారంలో ఉన్న ఝరికోన ప్రాజెక్టు.. వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే రూపకల్పన దాల్చుకుంది. జిల్లాలోని ఝరికోన వద్ద 7 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. అలాగే పీలేరు నియోజకవర్గంలోని అడవిపల్లె రిజర్వాయర్‌ను 2.50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. 5 మండలాలకు తాగు, సాగునీరే ధ్యేయంగా శ్రీనివాసపురం(నాగిరెడ్డి) రిజర్వాయర్ హంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగంగా 308 కోట్ల రూపాయలతో 1.25 టీఎంసీల సామర్థ్యంతో చిన్నమండెం మండల కేంద్రం సమీపంలో నిర్మించారు. అలాగే మదనపల్లెలో హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండవ దశ పనులకు రూ. 4200 కోట్ల మంజూరుకు చర్యలు చేపట్టారు.
విద్యాపరంగా ఎంతో అభివృద్ధి
రాయచోటిలో 150 కోట్ల రూపాయలతో 5 మోడల్ పాఠశాలలను మంజూరు చేయడంతోపాటు వాటికి భవనాలను నిర్మించి ఇచ్చారు. వీటితోపాటు అన్నమయ్య జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో విద్యాభివృద్ధికి వైఎస్సార్ ఎంతో కృషి చేసి పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారు. ఆయన అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఎంతో మందిని ఉన్నత స్థానాల్లో నిలిపింది. నేటికీ అనేక మంది వైఎస్సార్ అందించిన తోడ్పాటును స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.
ప్రజల హృదయాల్లో ..
రాజంపేట–రాయచోటి మార్గంలో చెయ్యేరు నది సమస్య లేకుండా నదిపై రూ.7 కోట్లతో బాలరాచపల్లె వంతెన నిర్మాణం జరిగింది. వ్యవసాయ పరంగా రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, పేదలందరికీ ఇళ్లు పథకాలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, 108 పథకాల ద్వారా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.
నేడు వైఎస్సార్ జయంతి
దివంగత వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేయడంతోపాటు ఘనంగా నివాళులర్పించనున్నారు. అలాగే పలు సేవా కార్యక్రమాల ద్వారా ఆయన పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
డాక్టర్ వైఎస్సార్ రాకతో జిల్లా రూపురేఖలు మారాయి. కలలో కూడా నిర్మించలేమనుకున్న ఎన్నో పనులు పూర్తయ్యాయి. రహదారుల నిర్మాణం, విద్యాభివృద్ధికి కళాశాలలు మంజూరు, సాగునీటి ప్రాజెక్టులు, పక్కాగృహాలు ఇలా చెబుతూపోతే ప్రతి విభాగంలోనూ వైఎస్సార్ ముద్ర కనిపిస్తుంది. నాటి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనేక రంగాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేశారు. అన్నమయ్య జిల్లాలో రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని పీలేరులో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, జిల్లాలో లక్షకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పేరెన్నికగన్న విద్యా సంస్థల ఏర్పాటు, వేలాది మందికి రేషన్‌కార్డులతోపాటు పింఛన్లతో జిల్లాపై డాక్టర్ వైఎస్సార్ చెరగని ముద్ర వేశారు.


