చౌడేపల్లె మండలంలో కాటిపేరి వద్ద సాగు చేసిన బంతి పూల తోట
చౌడేపల్లి: గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తరుణంలో పంట మార్పిడి ద్వారా ఒక రైతు ఎలా విజయం సాధించవచ్చో నిరూపించాడు చౌడేపల్లి మండలానికి చెందిన రంగనాథ్. వరుస నష్టాలు తెచ్చిన టమాటా పంటను పక్కనబెట్టి, వినూత్న ఆలోచనతో బంతిపూల సాగు చేపట్టి అద్భుత దిగుబడులతో తోటి రైతులకు ఆదర్శంగా నిలిచాడు.
నష్టాల టమాటా – అప్పుల ఊబి
కాటిపేరి గ్రామానికి చెందిన కె.రంగనాథ్‌కు కాటిపేరి నుంచి కావలివారిపల్లెకు వెళ్లే మార్గంలో 10 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఏటా సీజన్ల వారీగా ఈ పొలంలో దశలవారీగా టమాటా పంటను సాగు చేసేవాడు. గత మూడేళ్లుగా టమాటా సాగులో మంచి దిగుబడులు సాధించినప్పటికీ, మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందలేదు. దీంతో రంగనాథ్ తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.
ఐదు ఎకరాల్లో బంతిపూల సాగు – అధునాతన పద్ధతులు
సరిగ్గా అదే సమయంలో రంగనాథ్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని బంతిపూల సాగు వైపు దృష్టి సారించాడు. చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని ఓ నర్సరీ నుంచి ‘ఎల్లో రకం అష్టగంధ’, ‘రెడ్ రంగు అష్టగంధ’ పూల జాతి వక్కల్ సీడ్ మొక్కలను కొనుగోలు చేశారు. ఒక్కొక్క బంతిపూల నారును రూ. 1.60 చొప్పున, ఎకరాకు 8 వేల మొక్కల చొప్పున తెచ్చి నాటారు. ఐదు ఎకరాల పొలాన్ని పలుమార్లు బాగా దుక్కి దున్ని, సేంద్రీయ ఎరువులను మట్టిలో మిశ్రమమయ్యేలా చేశాడు. నాలుగు అడుగుల వెడల్పుతో గట్లు (బెడ్స్) ఏర్పాటు చేసి, మల్చింగ్ పేపర్ ఉపయోగించకుండా, కేవలం బిందు సేద్యం ద్వారానే సాగు చేపట్టారు. మొక్క నాటిన వారం రోజుల తర్వాత గ్రోత్ ప్రమోటర్లు అందించడం, తెగుళ్లకు మందులు పిచికారీ చేయడంతో మొక్కలు నాలుగు అడుగుల ఎత్తు పెరిగి ఆకర్షణీయమైన పూలతో భారీ దిగుబడిని ఇచ్చాయి. ఎకరాకు కూలీలు, మందులు, ఇతర పెట్టుబడుల ఖర్చు అంతా కలిపి రూ. 1 లక్ష వరకు అవుతుందని రంగనాథ్ తెలిపారు.
కిలో రూ.160 ధర.. ఎకరాలకు 10 టన్నుల దిగుబడి!
మొక్క నాటిన 55 రోజులకు పంట కోత దశకు వచ్చింది. చీడపీడలు, తెగుళ్ల నుంచి పంటను రక్షించుకుంటే ఏకంగా నాలుగు నెలల పాటు బంతిపూల కోత దిగుబడి పొందవచ్చని రంగనాథ్ వివరించాడు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో బంతిపూలు రూ. 140 నుండి రూ. 160 వరకు రికార్డు ధర పలుకుతోంది. ఎకరాకు 8 నుండి 10 టన్నుల బంతిపూల దిగుబడి సాధించామని, తోటలో ఇంకా కోత దశకు వచ్చే మొగ్గలు చాలా ఉన్నాయని తెలిపారు.
కూలీల కొరత ఉన్నా.. తోట వద్దకే మార్కెట్!
ఈ పంటకు కూలీల అవసరం తక్కువగా ఉంటుంది. నారు నాటే సమయం, కలుపు తీసేందుకు, మందుల పిచికారీ మరియు కోత సమయంలోనే కూలీలు అవసరం. ప్రస్తుతం కూలీలకు రోజుకు రూ. 600 నుండి రూ. 800 ఇస్తున్నా కొరత వేధిస్తోందన్నారు. అయితే, మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. చౌడేపల్లిలో సాగు చేసిన పూలను క్రేట్‌ల ద్వారా గ్రేడింగ్ చేసి బెంగళూరు, హైదరాబాద్, లంక, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, చైన్నె తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పూలకు భారీ డిమాండ్ ఉండటంతో వ్యాపారులే నేరుగా తోట వద్దకు వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్తుండటం విశేషం.


