నిమ్మనపల్లె : గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు వెంటనే తమ గ్రామ పంచాయతీలోని ఫొటో ఓటరు సర్వే జాబితాను డీఎల్‌పీఓ లాగిన్‌లో అప్‌లోడ్ చేయాలని డీఎల్‌పీఓ నాగరాజు అన్నారు. శుక్రవారం స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో ఫొటో ఓటరు జాబితా ఆన్‌లైన్ కార్యక్రమాలను పరిశీలించి సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు రోజుల్లోగా ఫొటో ఓటరు జాబితా సర్వే పూర్తి చేసి పూర్తి వివరాలను ఆన్‌లైన్ చేయాలన్నారు. అనంతరం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన ట్రై సైకిళ్లను పరిశీలించారు. వాటిని పంచాయతీ అభివృద్ధి అధికారులు స్థానిక గ్రీన్ అంబాసిడర్లకు అందించి ప్రతి రోజు ఇంటింటి చెత్తసేకరణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సేకరించిన చెత్త ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రాలకు తరలించి వర్మీకంపోస్టు తయారీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నిమ్మనపల్లెలో జరుగుతున్న పన్ను వసూళ్లు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బంది ప్రతి కుటుంబ యజమానితో మాట్లాడి అవగాహన కల్పించి పన్నులు 100 శాతం వసూలయ్యేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ రమేష్‌బాబు, డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు తదితరులు పాల్గొన్నారు.


