ప్రేమ వివాహం చేసుకున్నానని వెలివేశారు | - | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం చేసుకున్నానని వెలివేశారు

Mar 6 2026 8:21 AM | Updated on Mar 6 2026 8:21 AM

అడిషనల్‌ ఎస్పీ ఎదుట

కన్నీటి పర్యంతమైన బాధితురాలు

మదనపల్లెటౌన్‌: తాను డిగ్రీ చదివే సమయంలో ఊర్లో ఉన్న యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నాను. తల్లిదండ్రులు మా ప్రేమను అంగీకరించి ఊరి కట్టుబాట్లను పక్కన పెట్టి పెళ్లి చేశారన్న కోపంతో ఊరి పెద్దలు తనతో పాటు తల్లిదండ్రులను ఊరి నుంచి వెలిశారని గురువారం మధ్యాహ్నం సోమల మండలం, కందూరు గ్రామం, బాలం వారిపల్లి కి చెందిన సరస్వతి, వెంకటరమణ దంపతుల కుమార్తె గౌరీ మదనపల్లె అడిషనల్‌ ఎస్పీ వెంకటాద్రికి ఫిర్యాదు చేసింది. తాను ఆనంద్‌ కుమార్‌ను 2003లో ప్రేమ వివాహం చేసుకున్నానని పేర్కొంది. ఆరు నెలల పాటు సంసారం సజావుగా సాగిందని..ఈ క్రమంలోనే ఊరి పెద్దలు శేఖర్‌, రమణ, హరి, సుబ్రహ్మణ్యంలు పెద్దలను ఎదిరించి పెళ్లి చేశారని ప్రేమ వివాహం చేసుకున్న తనతో పాటు నా తల్లిదండ్రులను ఊరి నుంచి వెలివేశారని బాధితురాలు ఆరోపించింది. రెండేళ్లుగా సోమల పోలీస్‌ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఇంటికొకరిని తీసుకువచ్చి రాద్ధాంతాలు చేసి మా సంసారాన్ని కూల్చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటూ శేఖర్‌ తమకు న్యాయం జరగకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఊర్లో ఉన్న వారెవరూ మాతో మాట్లాడకూడదని నిబంధనలు పెట్టినట్లు వాపోయింది. మాతో గ్రామస్తులు ఎవరైనా మాట్లాడితే రూ.5000 కట్టాలని తీర్మానం చేసినట్లు చెప్పారు. తమకు కూడా రూ.20 వేలు వేశారని ఆ మొత్తం చెల్లిస్తే ఊర్లోకి రానిస్తాం.. లేకుంటే రానివ్వమని పెద్దలు ఊరి నుంచి వెలి వేయడంతో తన ఇంట్లో అన్నా వదినలను పెట్టి ఊరు విడచి సూరయ్యగారి పల్లికి వచ్చేశామని గౌరీ, ఆమె తల్లి దండ్రులు సరస్వతి వెంకటరమణ కన్నీటి పర్యంతమయ్యారు. కూలి పనులు చేసే తమకు రూ.20 వేలు కట్టే స్థోమత లేక రెండేళ్లుగా నరకం అనుభవిస్తున్నామని తెలిపారు. తనకు బాబు పుట్టాడు. తన భర్తతో కలిపి మా సంసారాన్ని నిలబెట్టాలని అడిషనల్‌ ఎస్పీని వేడుకున్నారు. ఊరి కట్టుబాట్ల పేరుతో వెలివేయడం తమకు శాపంగా మారిందని గౌరీ కంటతడి పెట్టింది. స్పందించిన అడిషనల్‌ ఎస్పీ వెంకటాద్రి వెంటనే చౌడేపల్లి సీఐ సాయి ప్రతాప్‌, సోమల ఎస్సైతో మాట్లాడారు. గ్రామస్తులు, పెద్దమనుషులతో మాట్లాడి బాధితుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement