ఫారెస్ట్‌ ఏబీఓకు వడదెబ్బ | - | Sakshi
Sakshi News home page

ఫారెస్ట్‌ ఏబీఓకు వడదెబ్బ

Mar 6 2026 8:21 AM | Updated on Mar 6 2026 8:21 AM

మంటలు ఆర్పేందుకు గ్రామస్తులతో కలిసి కొండపైకి వెళ్లిన హరి శంకర్‌ రెడ్డి

అక్కడే వడదెబ్బతో తీవ్ర అస్వస్థత

నిమ్మనపల్లె : అడవిలో అంటుకున్న మంటలను ఆర్పేందుకు గ్రామస్తులు, తోటి అధికారులతో వెళ్లిన ఫారెస్ట్‌ అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌(ఏబీఓ) దారి తప్పి, కొండపై వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు లోనైన సంఘటన గురువారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. రాచవేటివారిపల్లె పంచాయతీలోని నూరుకుప్పల కొండకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో, స్థానికులు బుధవారం సాయంత్రం ఫారెస్ట్‌ అధికారుల దష్టికి తెచ్చారు. స్పందించిన అటవీశాఖ అధికారులు బుధవారం రాత్రి అడవిలో మంటలు ఆర్పేందుకు కృషి చేశారు. గురువారం పెద్ద కొండపై మరికొంత మేర మంటలు అలాగే ఉండడంతో, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ శోభారాణి, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ హరిశంకర్‌ రెడ్డి, స్థానికులతో కలిసి కొండపైకి మంటలు ఆర్పేందుకు వెళ్లారు. ఈ క్రమంలో హరి శంకర్‌ రెడ్డి దారి తప్పి మరో ప్రదేశంలోకి వెళ్లాడు. అయితే అదే సమయానికి ఎండ అధికమై, వడ దెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. బీట్‌ ఆఫీసర్‌ శోభారాణికి ఫోన్‌ చేసి తన సమస్యను తెలిపాడు. దీంతో వెంటనే ఆమె ఫారెస్ట్‌ అధికారులకు, నిమ్మనపల్లె పోలీసులకు సమాచారం అందించింది. స్పందించిన పోలీసులు స్థానికుల సహాయంతో, హరిశంకర్‌ రెడ్డి ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా, కొండపై అతని ఆచూకీ గుర్తించారు. అధికారులు అక్కడికి వెళ్లేటప్పటికి హరిశంకర్‌ రెడ్డి అపస్మారక స్థితిలో ఉండగా, హుటాహుటిన కిందికి తీసుకువచ్చి, గ్లూకోజ్‌ వాటర్‌ అందించి సపర్యలు చేయడంతో మెలుకువలోకి వచ్చాడు. మదనపల్లె ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి జయప్రసాదరావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం 108 వాహనానికి సమాచారం అందించి, హరి శంకర్‌ రెడ్డి ని మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement