మదనపల్లెటౌన్: బాణసంచా తయారీ కేంద్రాలు, విక్రయశాలల్లో తనిఖీలు పూర్తయ్యే వరకు వాటిని మూసివేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఎస్పీ మాట్లాడుతూ కాకినాడ జిల్లా, వేట్లపాలెంలో జరిగిన ప్రమాదాన్ని దష్టిలో ఉంచుకుని, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు.. జిల్లావ్యాప్తంగా బాణసంచా తయారీ కేంద్రాలు, విక్రయశాలలపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామన్నారు. మదనపల్లె, రాయచోటి సబ్–డివిజన్ల పరిధిలో రెవెన్యూ, అగ్నిమాపక శాఖల సమన్వయంతో పోలీసులు తనిఖీలు చేపట్టారన్నారు. గోడౌన్లలో తగినంత ఇసుక, నీరు, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉండాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా ‘స్పార్క్–ప్రూఫ్’సిస్టమ్స్ ఉండాలని తెలిపారు. ప్రతి విక్రయశాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి ఫీడ్‌ను స్థానిక పోలీస్‌స్టేషనన్‌కు అనుసంధానించాలని ఆదేశించారు. అక్రమంగా టపాసులు నిల్వ చేసినట్లు గమనిస్తే 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ పేర్కొన్నారు.
ఎస్పీ ధీరజ్ కునుబిల్లి


