చౌడేపల్లె : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని కాగతిపంచాయతీ పలగార్లపల్లె సమీపంలోని పొలాల్లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పలగార్లపల్లెకు చెందిన వెంకటరమణ(50) గత రెండు రోజుల క్రితం తండాకు చెందిన తన స్నేహితుడు మృతి చెందడంతో బయటికి వెళ్లాడు. తిరిగి ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ తెలియకపోవడం, తన తండ్రి ఎప్పుడొస్తారో అని ఎదురుచూసిన వారికి పెను విషాదం మిగిలింది. చండ్రమాకులపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో గల ట్రెంచ్ కాలువలో పశువుల కాపరులు.. మృతదేహాన్ని గుర్తించి సమాచారం రావడంతో వెంకటరమణగా నిర్ధారించారు. కాగా పంట పొలాల్లోకి వచ్చే అటవీ జంతులను వేటాడే క్రమంలో ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి వెంకటరమణ మృతి చెందాడని, బయటకు పొక్కనీయకుండా మృతదేహాన్ని నీళ్లలో పడేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా అతని మృతిపై పోలీసులదధర్యాప్తులో నిజాలు వెల్లడి కావాల్సి ఉంది.


