● విజయవాడలో అంగన్వాడీలను అరెస్టు చేయడంపై మహిళల ఉద్యమం
● జిల్లాలో భారీ ర్యాలీ,
మానవహారం, నిరసనలు
సాక్షి అన్నమయ్య : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని....తాము ప్రతినిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ మహిళలు ఆందోళన బాట పట్టారు. అయితే న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలోనూ చంద్రబాబు సర్కార్ అవలంభిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ మహిళలు ఉద్యమబాట పట్టారు. ఒక్కసారి కాదు..రెండుసార్లు కాదు....గతంలో ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద, కలెక్టరేట్ వద్ద నిరసనలు, నిరాహార దీక్షలతో హోరెత్తించారు. అయినప్పటికీ చంద్రబాబు సర్కార్ అంగన్వాడీల సమస్యల పరిష్కారంలోఎలాంటి చొరవ తీసుకోలేదు. ఒకవైపు దీక్షలు కొనసాగుతుండగా, మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారిపై విజయవాడలో పోలీసులు వ్యవహారించిన తీరును నిరసిస్తూ మంగళవారం మహిళలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు.
కొనసాగుతున్న రిలే దీక్షలు
అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దాదాపు ఎనిమిది రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. జిల్లాలోని పుంగనూరు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద రోజూ పదుల సంఖ్యలో మహిళలు దీక్షలను సాగిస్తున్నారు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాలలో కూడా రిలే దీక్షలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు.
న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం...
అంగన్వాడీ కార్యకర్తలు, వర్కర్లు తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వేతనాల పెంపుపై ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామిలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు, జీవన వ్యయం పెరిగిపోతోందని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గౌరవ వేతనాన్ని పెంచాలంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలలని, యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ పనిభారాన్ని తగ్గించి రిజిష్టర్ల నిర్వహణను సరళతరం చేయాలని కోరుతున్నారు. ఉద్యోగ విరమణ సందర్బంగా ఇచ్చే ప్రయోజనాలను పెంచాలన్నారు. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నందున అంగన్వాడీలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగించాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని ప్రభుత్వం నిర్బంధ కాండకు ఒడిగట్టడం దారుణమంటున్నారు.
విజయవాడ దమనకాండకు జిల్లాలో నిరసన
అంగన్వాడీ కార్యకర్తల, హెల్పర్లు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దీక్షలు చేస్తున్న మహిళలపై పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహారించి వారిని అడ్డుకోవడం, లాక్కెళ్లడం, దీక్షలను భగ్నం చేయడంపై జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు రగలిపోయారు. తంబళ్లపల్లె, బి.కొత్తకోట, మదనపల్లెలోని ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఉద్యమించారు. అలాగే పుంగనూరులో అంబేడ్కర్ విగ్రహం వద్ద సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాయచోటిలో కూడా పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి భారీ ర్యాలీతోపాటు నేతాజీ సర్కిల్ వద్ద మానవహారం నిర్మించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా దీక్షలు చేస్తున్న అంగన్వాడీల పట్ల పోలీసుల తీరును ఖండించారు.అన్ని వర్గాల నాయకులు వారికి మద్దతు తెలియజేశారు. ఏది ఏమైనా అంగన్వాడీలు రోడ్డెక్కి ఉద్యమబాట చేపట్టి ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టారు.


