కలకడ : ఇంటర్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థి, తరిగొండ లక్ష్మీనరసింహస్వామి తిరునాలకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. అటు దేవుడిని చూడక, ఇటు పరీక్ష రాయక మధ్యలోనే తనువు చాలించి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. కలకడ పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలం, గర్నిమిట్ట పంచాయతీ రెడ్డిమల్లువారిపల్లెకు చెందిన సుదర్శన్‌రెడ్డి కుమారుడు రూపానందరెడ్డి (17) శ్రీచైతన్య జూనియర్‌కళాశాల–పీలేరులో ఇంటర్‌మీడియట్ మొదటిసంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం 9గంటలకు పరీక్షలకు హాజరు కావాల్సిన ఇతను ఆదివారం రాత్రి గుర్రంకొండ మండలం, తరిగొండ గ్రామంలో జరుగుతున్న శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయ ఉత్సవాలకు హాజరయ్యేందుకు ఏపీ 03బివై4616 ద్విచక్రవాహనంలో ఇంటివద్దనుంచి బయలుదేరి వెళుతుండగా తెల్లవారు జామున సుమారు 4గంటల సమయంలో కలకడ మండలం, కదిరాయచెర్వు పంచాయతీలోని హంద్రీ–నీవా కాలువ వద్ద నిర్లక్ష్యంగా రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ నంబర్ :ఎపి04బికె3779ను డీ కొన్నాడు. ఈప్రమాదంలో గాయపడిన రూపానందరెడ్డి అక్కడికి అక్కడే మృతిచెందారు. మృతుని తండ్రి సుధర్శన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కలకడ పోలీసులు తెలిపారు. పరీక్షకు హాజరు కావాల్సిన విధ్యార్థి మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
తిరునాలకు వెళుతూ
రోడ్డు ప్రమాదంలో మృతి


