వేర్వేరు ప్రమాదాల్లో 9 మందికి గాయాలు
మదనపల్లెటౌన్ : వేర్వేరు ప్రమాదాల్లో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె పట్టణం రెడ్డెప్ప నాయుడు కాలనీకి చెందిన దంపతులు రిటైర్డ్ అధ్యాపకురాలు భవానీదేవి(63) రిటైర్డ్ టీచర్ ఆనంద నాయుడు(65) బీరంగి కొత్తకోట మండలంలోని చలిమామిడి వద్ద కొత్తగా నిర్మించిన సీతా రామాలయం ప్రారంభోత్సవానికి వెళ్లారు. అనంతరం వారు తిరుగు ప్రయాణమై కారులో మదనపల్లెకు వస్తుండగా, మార్గంమధ్యలోని కురబలకోట మండలం చెన్నామర్రి మిట్టపై కారుకు కుక్క అడ్డు రావడంతో తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి గుంతలోకి దూసు కెళ్లింది. ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న కురబలకోట 108 సిబ్బంది మనోహర్, బావాజాన్‌లు క్షత గాత్రులను చికిత్సల కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు.
కారు ఢీకొని..
కారు ఢీకొని చేనేత కార్మికులు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి తాలూకా ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాలు.. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన చేనేత కార్మికులు వెంకటరమణ, రమేష్ గుర్రంకొండ మండలం తరిగొండ ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ద్విచక్ర వాహనంలో వెళ్లారు. అక్కడ భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మెక్కులు తీర్చుకున్నారు. అనంతరం తిరిగి ఇద్దరూ మదనపల్లెకు బైకులో వస్తుండగా.. మార్గంమధ్యలోని సిటిఎం క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను స్థానికులు 108 సాయంతో స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలు కుంటూ ఉన్నారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బొలెరో ఢీకొని..
బొలెరో ఢీకొని రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం నిమ్మనపల్లె మండలంలో వెలుగు చూసింది. ప్రమాదానికి సంబంధించి బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. జాండ్ర బెలు గ్రామానికి చెందిన రైతు విశ్వనాథ నాయుడు (54) శనివారం రాత్రి సొంత పనిపై పుంగనూరుకు బైకులో వెళ్లాడు. అక్కడి పనిముగించుకుని తిరిగి అదే రోజు రాత్రే ఇంటికి వస్తుండగా, మార్గంమధ్యలోని వనమల దిన్నె వద్ద బొలెరో వాహనం వేగంగా వచ్చి రైతు ప్రయాణిస్తున్న బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతుకు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు వెంటనే వెళ్లి బాధితున్ని ఓ ప్రయివేట్ వాహంలో చికిత్సల కోసం హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్సలు అందించి, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. దీంతో వారు ఆ రైతును వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
స్కూటర్ ఢీకొని..
స్కూటర్ ఢీకొని విద్యార్థి తీవ్రంగా గాయపడ్డ సంఘటన ఆదివారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. రేణుమాకులపల్లె పంచాయతీ దండువారిపల్లెకు చెందిన విశ్వనాథ్ కుమారుడు జయప్రకాష్ (15) స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో సొంతపనిపై రేణుమాకులపల్లె క్రాస్ వద్దకు స్నేహితులతో వెళ్లాడు. రోడ్డు పక్కన నిలబడి ఉండగా ముదివేడు వైపు నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని ద్విచక్ర వాహనం విద్యార్థి జయప్రకాష్‌ను ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదం లో కాలు విరిగి తీవ్రంగా గాయపడిన బాధితున్ని కుటుంబీకులు చికిత్సల కోసం వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయారు రెఫర్ చేశారు. ఘటనపై తంబళ్లపల్లె పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కరెంట్ షాక్‌తో..
మదనపల్లెటౌన్ : కరెంటు షాక్ కొట్టి ఎలక్ట్రీషియన్ తీవ్రంగా గాయపడిన సంఘటన మదనపల్లెలో ఆదివారం జరిగింది. ప్రమాదానికి సంబంధించి జిల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. మదనపల్లె చెంబకూరు రోడ్డులో కాపురం ఉంటున్న ఎలక్ట్రీషియన్ మహబూబ్ జానీ(38) స్థానిక కొత్త ఇళ్లలోని ఓ ఇంటికి యాంటీనా అమర్చుతుండగా కరెంటు షాక్ కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాధితున్ని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి, వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటు ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు.
చెట్టుపై నుంచి పడి..
తంబళ్లపల్లె: చెట్టుపై నుంచి పడి రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన తంబళ్లపల్లె మండలంలో ఆదివారం జరిగింది. పులసరంవాడ్లపల్లెకు చెందిన శివకుమార్‌నాయుడు(50) చింతకాలయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. కాయలు కోస్తుండగా ప్రమాదశాత్తు పట్టు తప్పి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన తంబళ్లపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రాయితో భార్య తలపై కొట్టిన భర్త
ఎర్రగుంట్ల : మద్యం మత్తులో కోపంతో భార్య తలపై భర్త రాయితో కొట్టిన సంఘటన ఆదివారం ఎర్రగుంట్లలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిలంకూరు గ్రామానికి చెందిన జ్యోతి, చంటి అనే భార్యాభర్తలు కుటుంబ కలహాల వల్ల వేర్వేరుగా ఉన్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ఆదివారం చంటి కుమార్తెను చూడడానికి వెళ్లాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తర్వాత ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న జ్యోతిని చంటి రాయితో తలపై గట్టిగా కొట్టాడు. రక్త గాయంతో జ్యోతి ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. వెంటనే సీఐ విశ్వనాథరెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ రాజారెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ ఆల్‌ఫ్రేడ్‌తోపాటు మరి కొందరు పోలీసులు ఆటోలో చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన దంపతులు భవానీదేవి, ఆనంద నాయుడు, ఆస్పత్రిలో వెంకటరమణ
వేర్వేరు ప్రమాదాల్లో 9 మందికి గాయాలు


