అత్తపై అల్లుడి దాడి
మదనపల్లెటౌన్ : బిడ్డను ఇచ్చి పెళ్లి చేసిన అత్తపైనే అల్లుడు దాడి చేసి తీవ్రంగా గాయపరచాడు. ఈ సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. బాధితురాలి కుటుంబీలు తెలిపిన వివరాల మేరకు.. సీటీఎం పంచాయతీ చిలకవారిపల్లెకు చెందిన గంగులప్ప, జయమ్మ దంపతుల కుమార్తె శ్వేత ఐదేళ్ల క్రితం స్థానికంగా ఉంటున్న లక్ష్మీకాంత్‌ను పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న కొంత కాలానికే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగు తుండటంతో.. ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వారం రోజుల క్రితం లక్ష్మీకాంత్ తన భార్య శ్వేతను కొట్టడంతో ఆమె అలిగి పుట్టింటికి వచ్చేసింది. తిరిగి కాపురానికి వెళ్లక పోవడంతో లక్ష్మీకాంత్ ఆదివారం అత్తగారి ఇంటికి వెళ్లి భార్యతో గొడవపడ్డాడు. కూతుర్ని కొడుతుండగా అత్త జయమ్మ వెళ్లి అల్లుడిని అడ్డుకోవడంతో ఆమైపెనే దాడిచేసి తీవ్రంగా గాయయపరచాడు. కుటుంబీకులు బాధితురాని జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
తెలుగుగంగ కాలువ నీటిలో చిక్కుకున్న దుప్పి
కలసపాడు : మండలంలోని పుల్లారెడ్డిపల్లె వద్ద ఉన్న తెలుగుగంగ కాలువలో ఆదివారం ఓ దుప్పి అదుపుతప్పి పడింది. స్థానికులు గమనించి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు ఎఫ్‌బీఓ హసాన్‌బాషా అక్కడికి చేరుకున్నారు. ఆయన స్థానికుల సహకారంతో కాలువలోని దుప్పిని తాడు సాయంతో బయటికి తీసి అడవిలో వదలిపెట్టారు. దుప్పి నీటి కోసం కాలువ దగ్గరికి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు.


