● పశువులకు ఆహారంగా...
గుర్రంకొండ: టమాటా ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామాల్లో టమాటా ధరలు గిట్టుబాటు కాక రైతులు కాయలు కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు. పలుచోట్ల టమాటా తోటలు పశువులకు ఆహారంగా మారిపోతున్నాయి. టమాటా ధరలు మార్కెట్లో గత ఎనిమిది రోజులుగా రోజు రోజుకూ పతనమవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా ధరలు రూ.4 వరకు పలుకుతున్నాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 17వేల ఎకరాల్లో టమాటా పంట దిగుబడి వస్తోంది. టమాటా పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నా మార్కెట్లో గిట్టబాటు ధరలు లేక పోవడంతో రైతులు పంటసాగుకు ఖర్చు చేసిన పెట్టుబడి కూడా రాక భారీగా నష్టపోతున్నారు.
17 వేల ఎకరాల్లో ప్రస్తుత పంట దిగుబడి
జిల్లాలో ప్రస్తుతం 17వేల ఎకరాల్లో టమాటా దిగుబడి వస్తోంది. ప్రతి ఏడాది ఈసీజన్‌లో 22వేల నుంచి 28వేల ఎకరాల్లో టమాటా పంట దిగుబడి వచ్చేది. ఇటీవల కురిసిన వర్షాలకు, వాతావరణంలో సంభవించిన మార్పులతో టమాటా తోటలు కొంత వరకు దెబ్బతిన్నాయి. ఉన్నంతలో ప్రస్తుతం టమాటా పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. నెలరోజుల క్రితం వరకు వైరస్‌లు, రోగాలు, నల్లమచ్చలతో కుదేలైన టమాటాతోటలు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. రోగాలు లేని నాణ్యమైన టమాటాలు మార్కెట్‌కు వస్తున్నాయి. దీంతో పంట దిగుబడి రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఆశించినంతగా మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
బయట రాష్ట్రాల్లో దిగుబడి జోరు
బయట రాష్ట్రాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో టమాటా దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో ఇక్కడి టమాటా ధరలు పెరగడం లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. సాధారణంగా బయట రాష్ట్రాల్లో టమాటా దిగుబడులు తగ్గుముఖం పడితేనే మన జిల్లా టమాటా ధరలకు రెక్కలొస్తాయి. అయితే, తమిళనాడు, పశ్చిమబెంగాల్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో పాటు రాయలసీమ జిల్లాల్లో టమాటా దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో బయట రాష్ట్రాల వ్యాపారులు మన జిల్లాకు రావడం లేదు. దీంతో ఇక్కడి టమాటాలు బయట రాష్ట్రాలకు ఎగుమతి చేయకపోవడంతో ధరలు తుగ్గుముఖం పట్టాయి. స్థానిక వ్యాపారులే టమాటాలను కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు
ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవాలని టమాటా రైతులు కోరుతున్నారు. మార్కెట్లో టమాటా ధరలు అత్యధికంగా ఉన్నప్పుడు ధరలు తగ్గించి విక్రయించాలని మార్కెట్ అధికారులను ఆదేశించే ప్రభుత్వం నేడు తమకు గిట్టుబాటు ధరలు కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గతంలో 25 కేజీల టమాటా క్రీట్ ధర రూ. 2500 ఉన్నప్పుడు ప్రభుత్వం మార్కెట్లో ధరలు తగ్గించి రూ.1000కే ప్రజలకు అందించిన దాఖలాలున్నాయి. ఆదేవిధంగా నేడు ధరలు తగ్గుముఖం పడుతున్నందన ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు కల్పించి టమాటాలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఒక టమటా క్రీట్ ధర రూ. 800 కి ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులంటున్నారు.
జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు ఆరుగాలం పండించి సాగు చేసిన టమాటాలు చివరకు పశువులకు ఆహారంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు భారీగా పతమనమయ్యాయి. మార్కెట్‌కు టమాటాలు తీసుకొచ్చి విక్రయిస్తే కోతకూలీలు, రవాణా ఖర్చులు, కమీషన్లు,జాక్‌పాట్‌లు లెక్కిస్తే చేతికి ఒక్క రుపాయి కూడా వచ్చే పరిస్థితి రైతులకు కనిపించడం లేదు. దీనికితోడు మార్కెట్‌కు తరలించాలంటే వ్యయప్రయాసలు పడాల్సి ఉంది. అలాగే మళ్లీ ఎరువుల వినియోగం, చెట్లకు జనుము దారాలు కట్టడం వంటి పనులకు ఎకరానికి రూ. 20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలు చూస్తే ఈ డబ్బు కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఉన్న పంటను వదులుకోలేక పంటసాగుకు అదనపు ఖర్చు భరించలేక చివరకు కాయలు కోయ కుండా తోటల్లోనే వదిలేస్తున్నారు. పలువురు సగం పంట అయిన తరువాత, రెండునుంచి మూడు కోతలు కోసిన రైతులు చేసేదిలేక గొర్రెలు, పశువులకు ఆహారంగా వదిలేస్తున్నారు. కాయకష్టం చేసి సాగు చేసిన పంట గిట్టుబాటు ధరలు లేక ఇలా కళ్ల ముందే పశువులకు ఆహారంగా మారిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పాతాళానికి పడిపోయిన ధరలు
కోయకుండా తోటల్లోనేవదిలేస్తున్న రైతులు
మార్కెట్లో కిలో టమాటా రూ.4
కొన్ని చోట్ల పశువులకు ఆహారంగామారుతున్న టమాటాలు
బయటరాష్రాల్లో దిగుబడితో తుగ్గుత్ను దరలు
● పశువులకు ఆహారంగా...


