రాయచోటిలో కొనసాగుతున్న విజిలెన్స్ దాడులు
రాయచోటి : రాయచోటిలో కూల్‌డ్రింక్స్, బేకరీ షాపులలో విజిలెన్స్, ఫుడ్‌సేఫ్టీ అధికారులు మూడు రోజులుగా దాడులు చేస్తున్నారు. శుక్రవారం కాలం చెల్లిన రూ.1.50 లక్షల విలువైన కూల్‌డ్రింక్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని రెండు గోడౌన్లలో కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్ విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. కాలం చెల్లిన కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా గడువు ముగిసిన పానియాలను నిల్వ చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. వీటిపై పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు. ప్రజలు ఏదైనా వస్తువు కొనే ముందు తయారీ, గడువు తేదీలను గమనించాలని అధికారులు సూచించారు.


