ఆస్తి కోసం ఘర్షణ
మదనపల్లెటౌన్: మదనపల్లెలోని ఇందిరా నగర్‌లో ఆస్తి కోసం రెండు కుటుంబాలు ఘర్షణకు పాల్పడ్డాయి. శుక్రవారం జరిగిన ఘటనపై బాధితులు టూ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. ఇందిరా నగర్‌కు చెందిన వేములయ్యకు కుమారులు సత్యనారాయణ, రామనారాయణ ఉన్నారు. వేములయ్య రామనారాయణ వద్ద ఉండగా ఆయన భార్య సిద్దమ్మ మరో కుమారుడి దగ్గర ఉంటోంది. దంపతుల మధ్య వివాదం ఉండడంతో ఆస్తుల విషయమై కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సిద్దమ్మ ఓ ఊరికి వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన వేములయ్య, రామనారాయణ ఇందిరానగర్‌లో ఉన్న సోదరుడి ఇంటిపైకి వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని గొడవకు దిగారు. గడ్డపార్లతో ఇల్లు ధ్వంసం చేసే యత్నం చేయగా బాధితులు 112కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని తెలుసుకున్న టూటౌన్ పోలీసులు వచ్చి వారందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
– ఆధార్ పేరుతో బంగారంతో ఉడాయింపు
బి.కొత్తకోట: మోసాలు చేసేందుకు దొంగలు కొత్త ఎత్తుగడలను ఎంచుకుంటున్నారు. ఇందులో నిత్యవసరాలు అందుతున్నాయా, దీనికి ఆధార్ అప్డేట్ చేయాలని చెప్పి మోసగించిన ఘటన శుక్రవారం బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకుంది. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు వివరాలు.. ఇందిరమ్మ కాలనీలో ఆదిలక్ష్మి(70), కృష్ణారెడ్డి దంపతులు కాపురం ఉంటున్నారు. కష్ణారెడ్డి ఆవులు మేపేందుకు వెళ్లగా ఆదిలక్ష్మి ఇంటి వద్దనే ఉంది. శుక్రవారం ఉదయం ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై ఆమె వద్దకు వచ్చారు. ఇంటి వద్ద నిలబడి ఉన్న ఆదిలక్ష్మితో ఆమె పేరు అడిగి, బియ్యం వస్తున్నాయా లేదా అని ఆరా తీశారు. ఆధార్ కార్డు తీసుకొని రావాలని చెప్పి, వేలిముద్రలు తీసుకోవాలని చెప్పగా ఆమె ఆధార్ కార్డు కోసం ఇంటి లోపలికి వెళ్లింది. ఆమెతోపాటే ఇంటిలోకి వెళ్లి ఫొటో తీసుకోవాలని చెప్పగా వారు మోసగాళ్లని తెలియక అంగీకరించింది. దాంతో దుండగులు ఫొటోకి మెడలోని తాళిబొట్టు ఉంటే బియ్యం ఇవ్వరని, మెడలోంచి తీసేయాలని చెప్పగా ఆమె తీసి ఒక కవర్లో పక్కన పెట్టింది. ఇద్దరిలో ఒకరు ఫొటో తీస్తుండగా మరొకొరు కవర్లో పెట్టిన బంగారు గొలుసును ఆమెకు తెలియకుండా తీసుకొని పరారయ్యారు. మోసపోయినట్టు గుర్తించిన ఆదిలక్ష్మి కోడలు, కొడుకుకు, కాలనీ వాసులకు చెప్పడంతో అందరూ కలిసి దుండగులు కోసం గాలించినా వారి ఆచూకీ దొరకలేదు. 45 గ్రాముల బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన వారిపై బాధితురాలు ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
పులికోన వంక వద్ద క్షుద్రపూజ కలకలం
చౌడేపల్లె : మండలంలోని ఆమినిగుంట పంచాయతీ పులికోనవంక గ్రామానికి వెళ్లే మార్గంలో క్షుద్రపూజ కలకలం రేపింది. రోడ్డు మధ్యలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గుపోసి, పూలు చల్లి, నిమ్మపండుకోసి, తాంబూలం పెట్టి అక్షింతలు, పసుపు, కుంకుమ చల్లి తాంత్రిక శక్తి పూజలు చేసినట్లు ప్రజలు శుక్రవారం గుర్తించి భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడూ లేని విధంగా రోడ్డుపై క్షుద్ర పూజ చేయడంతో పాఠశాలకు వెళ్లే పిల్లలు, తల్లిదండ్రులకు ఆందోళనకు గురవుతున్నారు. అటువైపు వెళ్లేందుకు సైతం జనం భయపడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేసి, బాధ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


