వైభవంగా తిరుచ్చి ఉత్సవం
స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తున్న అధికారులు, భక్తులు, స్వామివారికి శుద్ధితోమాల సేవ నిర్వహిస్తున్న అర్చకులు
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుచ్చి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం ఉదయాన్నే మూలవర్లకు శుద్ధితోమాల సేవ చేపట్టారు. ఆలయంలో స్వామి వారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. తిరుచ్చిలో స్వామివారికి అలంకరణ కావించారు. ఈ సందర్భంగా తిరుచ్చి ఉత్సవం గ్రామ వీధుల మీదుగా మేళతాళాలు, జానపద కళాకారుల భజనలతో కనుల పండువగా జరిగింది. వైభవంగా స్నపన తిరమంజనం కావించారు. వాహన మండపంలో స్వామివారి వాహనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. స్వామివారు పెద్దశేషవాహనంపై కొలువుదీరగా గ్రామ వీధులు మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు భక్తుల చేత పూజలు అందుకొన్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
నేటి కార్యక్రమాలు
తరిగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగ ఐదవ రోజైన శనివారం తిరుచ్చి ఉత్సవం, ఊంజల్‌సేవ, గజవాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు గోపాల బట్టర్ తెలిపారు.
వైభవంగా తిరుచ్చి ఉత్సవం


