రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు
మదనపల్లెటౌన్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. శుక్రవారం జరిగిన ఘటనలపై బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు.. కలకడ మండలం ఎనుగొండపాళ్యం గ్రామం గొల్లపల్లెకు చెందిన వెంకటేష్ కుమారుడు ఆనంద్ (20) బైకులో సొంతపనిపై తరిగొండకు గురువారం రాత్రి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. స్కూటర్‌లో వస్తుండగా మార్గంమధ్యలోని గుర్రంకొండ మండలం తరిగొండ సమీపంలోని వంకాయలోళ్లపల్లె వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి బైకు అదుపు తప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు వెంటనే వచ్చి చికిత్సల కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం ఆనంద్‌ను తిరుపతి రుయాకు తీసుకెళ్లాలని రెఫర్ చేశారు.
బస్సు ఢీకొని..
బస్సు ఢీకొని రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన మదనపల్లె పట్టణంలో జరిగింది. ఇందుకు సంబధించి ఒకటో పట్టణ సీఐ రాజారెడ్డి తెలిపిన వివరాలు.. పట్టణంలోని వాల్మీకి వీధిలో కాపురం ఉంటున్న రైతు లక్ష్మీనారాయణ(57) కురబలకోట మండలం లోని చింతమాకులపల్లె వద్ద లీజుకు తీసుకున్న అల్లనేరేడు చెట్లకు నీళ్లు కట్టడానికి వెళ్లాడు. అక్కడ పని పూర్తిగానే తిరిగి ఇంటికి బైకులో బయలు దేరాడు. స్కూటర్ మార్గం మధ్యలోని మదనపల్లె పట్టణం, కదిరి రోడ్డు, మసీదు కాంప్లెక్స్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన శ్రీవారి ప్రయివేట్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ తెలిపారు.


