సంప్రదాయ బద్ధ్దంగా పెద్దూరు దేవరెద్దు ఎంపిక
● కాపువాని కుంటలో
ఎంపిక పూజలు
చౌడేపల్లె : సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం చెంత పూజలందుకొనేందుకు సాంప్రదాయబద్ధంగా గురువారం దేవరెద్దు ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. గతనెల 23వ తేదీన పెద్దూరుకు చెందిన దేవరెద్దు అనారోగ్యానికి గురై మృతిచెందిన విషయం తెలిసిందే. ఆస్థానంలోకి కొత్త దేవరెద్దు ఎంపిక ప్రక్రియను కాపువానికుంట చెర్వులో హిందూ సాంప్రదాయ రీతిలో చేపట్టారు. ముందుగానే గ్రామస్తుల తీర్మానం మేరకు నిర్ణీత సమయానికి దిగువపల్లె పంచాయతీ పరిధిలోని పెద్దూరు, గాజులవారిపల్లె, మోట్లపల్లె, దేవిరెడ్డి చెరువు గ్రామాల్లో గల ఆవులు, కోడె దూడలను తోలుకొచ్చారు. అక్కడ గ్రామపెద్దలు, ఆలయ అర్చకులు కలిసి అరటిఆకులో బియ్యం, బెల్లం, పప్పులు, సర్వశుద్ధి వేసి పళ్లెంను పెట్టి ఆవులు, దూడల మందను తోలడం ఆనవాయితీ , ఆ పళ్ళెంలోని పదార్థములను ఆవు, దూడ తింటే ఆ దూడను దేవరెద్దుగా ఎంపిక చేస్తూ తీర్మానించడం సంప్రదాయం. అదే తరహాలో మోట్లపల్లెకు చెందిన రెడ్డివారి కృష్ణప్ప ఆవు, దూడ పళ్లెంలోని పదార్థములు తినడంతో ఆ దూడను పెద్దూరు దేవరెద్దుగా ప్రకటించి పూజలు చేశారు.


