విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
మదనపల్లె రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్యం అందించే వైద్యులు, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్.వెంకటలక్ష్మయ్య తెలిపారు. గురువారం మదనపల్లె డివిజన్ పరిధిలోని అంగళ్లు, సీటీఎం పశువైద్యశాలను డీడీ రసూల్, ఏడీ రోహిణితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మదనపల్లె డీడీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అంగళ్లు పశువైద్యులు సెలవులో ఉన్నట్లు డీడీ రసూల్ తెలిపారన్నారు. తర్వాత సీటీఎం పశువైద్యశాలను పరిశీలిస్తే నిర్వహణ లోపాలు కనిపించాయన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌కు లేఖ రాశామన్నారు. సీటీఎం డాక్టర్‌పై ఏడాదికాలంగా వస్తున్న ఆర్‌టీఐ దరఖాస్తులు, ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపామన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు డాక్టర్ గౌరవ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నట్లు తేలిందన్నారు. దీంతో వైద్యుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డీడీ రసూల్‌కు సిఫారసు చేశామన్నారు. ప్రభుత్వ విధుల్లో ఉంటూ ఇతరత్రా ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహిస్తే ఊరుకునేది లేదన్నారు. డివిజన్‌లోని అన్ని పశువైద్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండి సకాలంలో పాడి రైతులకు సేవలు అందించాలన్నారు.


