ఇరువర్గాల ఘర్షణ: ఇద్దరికి గాయాలు
మదనపల్లెటౌన్: మదనపల్లిలో బుధవారం రాత్రి రెండు వర్గాల యువకులు ఘర్షణ పడ్డారు. కర్రలతో దాడులు చేసు కోవడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కథనం మేరకు .. చంద్రకాలనీకి చెందిన రమణ కొడుకు ప్రదీప్ (32), సీటీఎం రోడ్డు, బాలాజీ నగర్లో ఉండే బాలకృష్ణ అలియాస్ బాలు, నీరుగట్టువారిపల్లె రాజానగర్ కు చెందిన నరేష్, సోము, మణి కలసి మద్యం తాగుతుండగా కురబలకోట మండలం, అంగళ్లుకు చెందిన బ్రహ్మ తేజ బ్రదర్స్ తో గొడవ పడినట్లు తెలిసింది. వారు అక్కడ నుంచి వెళ్లిపోయి, తిరిగి రెండు బైకుల్లో ఆరుగురిని పిలుచుకొని మద్యం షాపు వద్దకు వచ్చారు. అదే సమయంలో ప్రదీప్‌ను చంద్ర కాలనీలో వదిలి పెట్టేందుకు బాలు, నరేష్‌లు బైకులో చంద్ర కాలనీకి వెళుతుండగా రాజరాజేశ్వరి గుడి వద్ద దారి కాచిన అంగళ్లుకు చెందిన బ్రహ్మ తేజ వర్గీయులు ప్రదీప్, బాలు నరేష్ లపై మూకుమ్మడిగా దాడి చేసి కర్రలతో కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రదీప్, బాలులను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలు తేరుకోగా, ప్రదీప్ కోమాలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు ప్రదీప్ ను వెంటనే బెంగళూరుకు తరలించారు. సమాచారం అందుకున్న తాలూకా సీఐ వెంకటరమణ, జిల్లా ఆస్పత్రికి చేరుకుని ఘటనకు కారణాలపై ఆరాతీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇరువర్గాల ఘర్షణ: ఇద్దరికి గాయాలు


