శ్రీకృష్ణుడి ఆలయంలో భారీ చోరీ
● కట్టర్లతో గేట్లు, తలుపులు ధ్వంసం
● రూ.25 లక్షల విలువైన నగదు, ఆభరణాలు అపహరణ
మదనపల్లెటౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా దేవుని గుడినే కొల్లగొట్టారు. అనపగుట్టలోని శ్రీకృష్ణుని ఆలయం తలుపులు, గేట్లను కట్టర్లతో ధ్వంసం చేసి రెండు హుండీలలోని నగదు, దేవుళ్ల విగ్రహాలపై ఉన్న మూడు వెండి కిరీటాలు, బంగారు తాళి బొట్లు, శంకు చక్రాలు, శటారి, పంచపాత్ర, నామాలు, కన్నులు, ఇతర నగలు, నగదును చోరీ చేశారు. మంగళవారం ఉదయం శ్రీకష్ణుని ఆలయానికి పూజలు చేసేందుకు వచ్చిన పూజారి చోరీ జరిగిందని గుర్తించి.. ఆలయ చైర్మన్ గురుశంకర్ యాదవ్‌తోపాటు కమిటీ వారికి సమాచారం అందించారు. వారు రెండవ పట్టణ పోలీసులకు చెప్పడంతో సీఐ మహమ్మద్ రఫీ, ఎస్సై రహీముల్ల, శ్రీరాములు, సిబ్బంది అనపగుట్టకు చేరుకున్నారు. కృష్ణుడి ఆలయంలో చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. విషయాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దృష్టికి తీసుకెళ్లడంతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను మదనపల్లెకి పంపించారు. ఆలయం వద్దకు చేరుకున్న జాగిలాలు, క్లూస్ టీమ్ సాయంతో పోలీసులు లోపల, బయట క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రలను సేకరించి, అణువణువునా గాలించారు. జాగిలం వాసన పడుతూ సమీపంలోని సంతాన వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు వెళ్లింది. జాగిలం తిరిగిన ప్రదేశాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. దీన్నిబట్టి దొంగలు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు, అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోందని పలువురు అంటున్నారు. ఆలయంలో ఉన్న వాచ్‌మాన్ తన భార్యకు ఆరోగ్యం బాగ లేకపోవడంతో చికిత్స కోసం వెళ్లడం గమనించి దొంగతనానికి పాల్పడ్డారు. గుడిలో ఉన్న రెండు పెద్ద సైజు హుండీలను ధ్వంసం చేసి, అందులోని నగదును పెద్ద మొత్తంలో అపహరించారు. అలాగే దేవుళ్ల విగ్రహాలపై ఉన్న మూడు వెండి కిరీటాలతోపాటు ఇతర ఆభరణాలను అపహరించుకు పోయారు. సుమారు రూ.25 లక్షల విలువైన నగలు, నగదు చోరీ చేశారని ఆలయ చైర్మన్ ఫిర్యాదు చేశారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా చోరికి పాల్పడిన దొంగలను త్వరగా పట్టుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న శ్రీకష్ణుని ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడడంతో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
జాగిలంతో పరిశీలిస్తున్న పోలీసులు
హుండీని ఆలయం వెలుపలకు తీసుకొచ్చి ధ్వంసం చేసిన దృశ్యం
శ్రీకృష్ణుడి ఆలయంలో భారీ చోరీ


