తరిగొండలో వైభవంగా ధ్వజారోహణం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన మంగళవారం ఉదయాన్నే మూలవర్లకు స్నపన తిరుమంజనం చేశారు. తోమాలసేవ, ఏకాంత సేవలతో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బ్రహోత్సవాలు జరిగే పది రోజుల పాటు ఆలయానికి, ఉత్సవాలకు, యజ్ఞయాగాలకు సంరక్షణగా ముక్కోటి దేవతలు ఉండాలని కోరుతూ.. వారిని ఆహ్వానిస్తూ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భేరితాండవం నిర్వహించి దేవతాహ్వానం చేశారు. ఈ సందర్భంగా గరుత్మంతునికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు. నైవేద్యంగా ఉంచిన ప్రసాదాలను సంతానం లేని మహిళలు స్వీకరిస్తే.. గరుత్మంతుని కృపతో సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. దీంతో కొంతమంది మహిళలు ఆలయానికి చేరుకొని సంతాన ప్రాప్తి కలిగించే ధ్వజారోహణ ప్రసాదాన్ని స్వీకరించారు. ఊంజల్ సేవ చేసి వాహన మండపంలో స్వామివారి వాహనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. స్వామి వారు హంసవాహనంపై కొలువు దీరి గ్రామ వీధుల మీదుగా ఊరేగారు. బ్రహోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అఽధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
నేటి కార్యక్రమాలు
మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం ఉదయం ముత్యపు పందిరి వాహనం, సాయంత్రం హనుమంత వాహనంలో స్వామి వారు కొలువుదీరి గ్రామ వీధుల్లో విహరిస్తారని అర్చకులు గోపాలబట్టార్ తెలిపారు. అదే రోజు ఉదయం స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మహిళలకు గరుత్మంతుని ప్రసాదం పంపిణీ చేస్తున్న అర్చకులు
ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తున్న వేదపండితులు
తరిగొండలో వైభవంగా ధ్వజారోహణం


