వేడి నీళ్లు మీద పడి బాలుడికి తీవ్ర గాయాలు
మదనపల్లెటౌన్ : వేడి నీళ్లు మీద పడి బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం గుర్రంకొండ మండలంలో జరిగింది. ఘటనపై మదనపల్లె జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండ మండలంలోని సుబ్బిరెడ్డిగారిపల్లికి చెందిన ఆనంద్ కుమారుడు అనిరుద్(5) ఇంట్లో ఆడుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో గ్యాస్ స్టవ్‌పై కాలుతున్న నీటిపాత్రను తాకాడు. ప్రమాదవశాత్తు ఆ నీళ్లు బాలుడిపై పడడంతో కాలి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు.
అగ్ని ప్రమాదం..
రూ.3 లక్షల నష్టం
మదనపల్లెటౌన్ : కాఫీ పొడి తయారీ షాపులో షార్ట్ సర్క్యూట్ సంభవించి సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన మంగళవారం మదనపల్లె పట్టణంలో జరిగింది. అగ్నిమాపక శాఖ అధికారి శివప్ప కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బెంగళూరు బస్టాండ్ సమీపంలో ఉన్న కిరణ్ కాఫీ వర్క్స్ దుకాణంలో మధ్యాహ్నం అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో దుకాణంలో ఉన్న వస్తువులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వెళ్లి మంటలను అదుపు చేసి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కట్టడి చేశారు. అప్పటికే సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని వాపోయాడు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు.
హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్
బి.కొత్తకోట : మండలంలోని రఘనాధపురానికి చెందిన కృష్ణప్ప(70)పై ఈ నెల 21న జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు సీఐ గోపాల్‌రెడ్డి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో నిందితులైన వారిలో తిమ్మారెడ్డి (75), అనసూయమ్మ (65), సరస్వతమ్మ (55)లను కాండ్లమడుగు క్రాస్ వద్ద అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు తెలిపారు. మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు.


