ఆందోళనలపై నమోదైన కేసుల్లోపోలీసుల కౌన్సెలింగ్
మదనపల్లె : ఏడేళ్ల బాలిక హత్యాచార ఘటనపై మంగళవారం మదనపల్లెలో జరిగిన ఆందోళనలపై నాలుగు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో నమోదైన వారిపై చర్యల్లో భాగంగా సోమవారం వారిని పోలీస్‌స్టేషన్ రప్పించారు. అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి శాంతి భద్రతల సమస్యగా మారింది. అలాగే నీరుగట్టువారిపల్లి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగించారు. దీనిపై వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఆందోళనలకు డ్రోన్‌లతో చిత్రీకరించారు. దీనికి ప్రధాన కారకులుగా గుర్తించిన 30 మందిని పోలీస్ స్టేషన్‌లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. కౌన్సెలింగ్ చేసిన సీఐలు కే.రాజారెడ్డి, మహమ్మద్ రఫీలు వారిని తిరిగి పంపేశారు.
మల్లయ్యకొండ అడవికి నిప్పు
తంబళ్లపల్లె : తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండ అడవికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సుమారు 500 ఎకరాలకు పైగా అడవి బుగ్గిపాలైంది. ములకలచెరువు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చినా ఆలస్యంగా వచ్చారు. మంటలు ఎగసిపడుతుండటంతో ఆర్పేందుకు కుదరక వారు వెనుదిరిగారు.
వ్యక్తి ఆత్మహత్య
చౌడేపల్లె : కడుపునొప్పి తాళలేక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. మండలంలోని పెద్దయల్లకుంట్లకు చెందిన గణపతిరెడ్డి(52)కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ ఉండేవాడు. నొప్పి తీవ్రం కావడంతో భరించలేక మద్యం తాగి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతిచెందాడు. మృతుడుకి భార్య పిల్లలు ఉన్నారు.


