పందెం కో ‘ఢీ’!
● కోడిపందేలకు సిద్ధమవుతున్న నిర్వాహకులు
● సంప్రదాయమంటున్న ప్రజలు
● చర్యలు తప్పవంటున్న పోలీసులు
రాయచోటి జగదాంబసెంటర్ : తెలుగు వారి పెద్దపండుగ సంక్రాంతి.. పండుగ దగ్గర పడుతుండటంతో గ్రామాల్లో సందడి నెలకొంది. సంబరాల వేళ భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగు రంగుల ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల సందడితో పాటు సంప్రదాయం పేరుతో కోడిపందాలు ఎక్కువగా నిర్వహిస్తారు. ఈ కోడిపందేలకు పందెంరాయుళ్లు సిద్ధమవుతున్నారు. పందాలకు అవసరమైన పందెం కోడిపుంజులకు గత 3, 4 నెలల నుంచి తర్ఫీదు ఇస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హెచ్చరిక ప్రకటనలు, కోడిపందేల స్థావరాలపై దాడులు, కేసులు నమోదు కొనసాగుతున్నాయి.
పందెం కోడిపుంజులకు డిమాండ్..
ఈ సంక్రాంతికి పందెం కోడిపుంజులకు మంచి గిరాకీ ఉంది. జాతి రకాన్ని, రంగును బట్టి రూ.5 వేలు నుంచి రూ.1 లక్ష వరకు ధర పలుకుతుంది. పందెం కోడి పుంజులకు రారాజుగా చెప్పుకునే నల్ల చెవళకు రూ.5 వేల నుంచి రూ.75 వేల వరకూ డిమాండ్ ఉంది. కక్కీరా, కల్లికల నెమలి, కాకి నెమలి, ఎర్ర నెమలి, కాకి డేగ, పచ్చకాకి డేగ, డేగ, పండు డేగ, కాకి, పంగళి చవళతో పాటు పలు రకాలు ఉన్నాయి. వీటి డిమాండ్‌ను బట్టి ధర నిర్ణయిస్తున్నారు.
కోస మాంసానికీ గిరాకీ..
ఏటా కోస మాంసానికి డిమాండ్ పెరుగుతోంది. నాలుగైదేళ్ల క్రితం 3 కిలోల కోస మాంసం రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఉండేది. కోస మాంసం రుచి చూసినవారు వాటి కోసం ఎగబడతారు. అదే సమయంలో పందెంరాయుళ్లు అధికారులకు, అనధికారులకు, అభిమానులకు, బంధువులకు కోస మాంసాన్ని ఇవ్వడంతో మరింత డిమాండ్ పెరిగింది. గతేడాది ఒక్కో కోసను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు విక్రయించారు. ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశం ఉందని నిర్వాహకులు, కోస మాంసం ప్రియులు పేర్కొన్నారు.
పందెం కోడికి.. కాస్ట్‌లీ ఫుడ్
రాజంపేట టౌన్ : సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుళ్లకు చేసే మర్యాదల గురించి అందరికి తెలిసిందే. అయితే పందెం కోళ్లకు పెట్టే ఆహారం, వాటి పట్ల తీసుకునే జాగ్రత్తల గురించి తెలిస్తే ఎవరికై నా ఆశ్చర్యం కలగక తప్పదు. ఒక్కమాటలో చెప్పాలంటే పందెం రాయుళ్లు పందెంకోళ్ల ఆహారం, వాటి ఆరోగ్యం పట్ల వెయ్యి కళ్లతో పర్యవేక్షిస్తూ చంటిబిడ్డలా చూసుకుంటున్నారు. పందెంరాయుళ్లు వేళకు భోజనం తినక పోయినా పందెం కోళ్లకు మాత్రం ఏ సమయానికి ఏ ఆహారం ఇవ్వాలి, ఎలాంటి వ్యాయామం చేయించాలో అన్నింటిని క్రమం తప్పకుండా చేస్తున్నారు. సంక్రాంతి దగ్గర పడుతుండటంతో పందెం కోళ్ల పట్ల మరింత శ్రద్ధ చూపుతున్నారు. నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పందెం కోళ్ల బాగోగులను అనుక్షణం చూసుకుంటున్నారంటే అతిశయోక్తి అనిపించక తప్పదు. పందెకోళ్లకు ఇస్తున్న ఆహారం, వాటి పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను కొత్తగా చూసే వారికి ‘పందెం కోడా.. మజాకా’ అనిపిస్తోంది.
అన్నీ పోషక ఆహారాలే..
పందెం రాయుళ్లు పందెం కోళ్లకు నిత్యం పోషక ఆహారాలను అందిస్తున్నారు. ఇందుకు కొంత మంది రోజుకు ఐదు వందల రూపాయల వరకు కూడా ఖర్చు చేస్తున్నారు. పోషక ఆహారాలైన నాటుకోడి గుడ్లు, బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష, రాగులు, సద్దలు, తెల్లజొన్నలు వంటివి ఉదయం నుంచి సాయంత్రం వరకు విడతలవారీగా తినిపిస్తున్నారు. పందేనికి మూడు రోజుల ముందు నుంచి అదనపు బలం కోసం బీ కాంప్లెక్స్ మాత్రలను కూడా తినిపించనున్నట్లు పందెం రాయుళ్లు చెబుతున్నారు. కొంత మంది నీళ్ల విషయంలోను శ్రద్ధ చూపుతున్నారు. కోళ్లకు మినరల్ నీటినే తాపిస్తున్నారు. పందెం కోళ్లను దగ్గరుండి చూసుకోలేని వారు రోజుకూలీ ఇచ్చి ప్రత్యేకంగా ఒకరిని ఏర్పాటు చేసుకుంటున్నారు.
ప్రత్యేక కసరత్తు..
పందెం రాయుళ్లు పందెం కోళ్లపై ప్రత్యేకమైన కసరత్తే చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పందెం కోళ్లతో ఈత కొట్టిస్తున్నారు. ఈత కొట్టించే అవకాశం లేని వారు కోడిని నీళ్లల్లో ముంచుతున్నారు. అలాగే నోటిలో నీళ్లు పోసుకొని కోడి ముఖంపై ఆ నీటిని గట్టిగా ఊదుతున్నారు. ఇలా చేయడం వల్ల బరిలో అలసట లేకుండా ప్రత్యర్థి కోడిపై వేగంగా తమ కోడి పోరాడగలదని పందెంరాయుళ్లు చెబుతున్నారు. కోడి ఈకల్లో పేలు చేరకుండా గోరువెచ్చటి నీటిలో వేప ఆకులు వేసి స్నానం చేయిస్తారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలే
పోలీసుల చట్ట నిబంధనలను అతిక్రమించి సంక్రాంతి పండుగలో కోడిపందాలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పందాలు, జూదగాళ్లకు వ్యతిరేకంగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసుల నిఘా పెంచాం. సంక్రాంతిని కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలి. నిబంధనలు అతిక్రమించి పందేలు వేస్తే చర్యలు తీసుకునేందుకు వెనుకాడం.
– చలపతి, అర్బన్ సీఐ, రాయచోటి
పందెం కో ‘ఢీ’!
పందెం కో ‘ఢీ’!
పందెం కో ‘ఢీ’!
పందెం కో ‘ఢీ’!
పందెం కో ‘ఢీ’!


