మండిపడుతున్న జనం
● అన్ని వేళ్లూ మంత్రి వైపే..
● జిల్లా కేంద్రం రాయచోటి మార్పుతో
రగిలిపోతున్న జనం
సాక్షి అమరావతి : అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పుతో రాయచోటిలో అలజడి నెలకొంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా కేంద్రం విషయంలో మార్పు ఉండదని మంత్రి చెప్పిన మాటలను నమ్మిన ప్రజలు ప్రస్తుత చంద్రబాబు సర్కార్ ఒక్కసారిగా మార్పు చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లారు. గతంలో 2024 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రాయచోటి ప్రజల సాక్షిగా ఏవేవో చేస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా ఇప్పుడు మాత్రం జిల్లా కేంద్రం మార్పుతోపాటు ఏకంగా రాయచోటిని మదనపల్లె జిల్లాలో కలపడంపై కాక రేగుతోంది. అందులోనూ జిల్లా కేంద్రానికి అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైతే తాను రాజీనామా చేస్తానంటూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి గట్టిగా చెప్పడంతో రాయచోటి ప్రజల్లో ధైర్యం ఉండేది. పైగా మదపల్లెను జిల్లాగా ప్రకటించిన తర్వాత కూడా రాయచోటిలో మంత్రి ఆధ్వర్యంలో అన్నమయ్యకు జిల్లా కేంద్రంగా రాయచోటినే కొనసాగింపు సంకేతాలు వచ్చాయంటూ ఇటీవల టీడీపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం..అంతలోనే కేంద్రం మార్పుతో రాయచోటి ప్రజలు మండిపల్లి కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్ 4న పునర్విభజనలో భాగంగా కొత్త జిల్లా ఏర్పడింది. అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసి రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి జిల్లా కేంద్రంగా కొనసాగుతున్న రాయచోటిని ఇప్పుడు మదనపల్లెలో కలుపుతూ మంత్రివర్గం తీర్మానించింది. అయితే మంత్రి మండిపల్లి మాటలను పట్టించుకోకుండా చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంత్రికి ఏదో ఒకటి చెప్పినా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట మీదనే ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి.
మూడు నియోజకవర్గాలతో
జిల్లా అంటూ ప్రచారం
సరిగ్గా నెలరోజుల కిందట మదనపల్లెను జిల్లాగా ప్రకటించిన అనంతరం రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు కలిపి జిల్లాగా ఉంటుందని సబ్ కమిటీ సమావేశానంతరం వివరిస్తూ వచ్చారు.ప్రస్తుతం రైల్వేకోడూరును తిరుపతిలో, రాజంపేటను వైఎస్సార్ కడపలో, రాయచోటిని మదనపల్లెలో కలుపుతూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాయచోటిలో పార్టీల నాయకులు, జేఏసీ ఉద్యమ బాట పట్టారు.
బాబు మాటలు నీటి మీద రాతలు
అన్నమయ్యకు సంబంధించి రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచుతాం...మార్పు చేయకుండా అభివృద్ధి చేస్తాం..నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ అపార వనరులు ఉన్నాయి. పండ్ల తోటలకు ప్రసిద్ది. పూర్తి స్థాయిలో అబివృద్ది చే స్తాం. మన అభ్యర్థిని గెలిపించడంటూ 2024 సార్వత్రిక ఎన్నికలకు నాలుగు రోజుల ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు రాయచోటిలోని నేతాజీ సర్కిల్ జిరిగిన బహిరంగసభలో మాట్లాడిన మాటలు...
జిల్లా కేంద్రం మార్పు చేస్తే రాజీనామా చేస్తా!
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి కొనసాగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. జిల్లా కేంద్రం మార్చాల్సిన పరిస్థితి వస్తే నేను రాజీనామా చేయడానికి కూడా వెనుకాడను. మీసం మెలేసి తొడగొట్టి చెబుతున్నా..ఎవరెన్ని చెప్పినా నమ్మొద్దు...జిల్లాకేంద్రం మార్పు ఉండదు.
– రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి


