జిల్లా కేంద్రం మార్పుపై రాయచోటిలో ఆందోళనలు
రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తొలగిస్తూ మదనపల్లె జిల్లా కేంద్రంలో కలుపుతున్నట్లు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాయచోటిలో ఆందోళనలు మిన్నంటాయి. సోమవారం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత ర్యాలీలో పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, విద్యార్థులు పాల్గొని సంఘీభావవాన్ని తెలిపారు. రాయచోటిలోని శివాలయం చెక్‌పోస్టు నుంచి సాగిన ర్యాలీ జూనియర్ కళాశాల, నేతాజీ సర్కిల్, బస్టాండు రోడ్డు, వైఎస్‌ఆర్ సర్కిల్ మీదుగా తిరిగి బంగ్లా సర్కిల్‌కు చేరుకుంది. నేతాజీ సర్కిల్లో మానవహారం చేపట్టి మదనపల్లె వద్దు రాయచోటి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అన్ని విధాలుగా వెనుకపడిన రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా కేంద్రంగా ఉంచుతామని హామీ ఇచ్చి నేడు మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి అందులో రాయచోటిని విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా ప్రజలు రాయచోటిలోని రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల విస్మయానికి గురైన రాయచోటి ప్రాంత ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేస్తూ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని వైఎస్పార్‌సీపీ నాయకులు, ఉద్యోగ, ప్రజా సంఘాలతో పాటు కూటమి పార్టీలోని నేతలు సైతం ప్రకటనల ద్వారా కోరుతున్నారు.


