చంద్రబాబూ..వాల్మీకి,బోయల గోడు పట్టించుకోండి
మదనపల్లె రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబు, వాల్మీకి, బోయల గోడు పట్టించుకోవాలని వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి (వీఆర్‌ఎస్‌ఎస్) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పొదల నరసింహులు కోరారు. గిరిజన రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టించి, ఆమోదం తెలిపేలా కేంద ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...ఇటీవల అసెంబ్లీలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, పార్లమెంట్‌లో ఎంపీ బైరెడ్డి శబరి, వాల్మీకి, బోయలకు ఎస్టీ రిజర్వేషన్‌పై చర్చించినప్పటికీ కొలిక్కి రాకపోవడం దారుణమన్నారు. 2017 డిసెంబర్ 2న అసెంబ్లీలో వాల్మీకి బోయలను గిరిజనులుగా గుర్తించాలని బిల్లును ఆమోదించడం అభినందనీయమన్నారు. అయితే ఆ బిల్లును పార్లమెంటుకు పంపినా నేటికీ పట్టించుకోకపోవడం తగదన్నారు. ఎస్టీ రిజర్వేషన్‌పై నాన్పుడు ధోరణిని ప్రదర్శిస్తే, వాల్మీకి బోయలు ఐక్యతతో పోరాటాలు, అసెంబ్లీ ముట్టడి, ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాల ముట్టడితో ఉద్యమం ఉధృతం చేయాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో వీఆర్‌ఎస్‌ఎస్ నాయకులు బొగ్గిటి కృష్ణమూర్తి, వాల్మీకిపురం విష్ణు, ఉలసల మంజు, నరసింహులు, రెడ్డిశేఖర, శ్రీనాథ్, రవికుమార్, భానుప్రకాష్, జయచంద్ర, ప్రవీణ్, పురుషోత్తం, సందీప్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.


