ఆసుపత్రి వృత్తుల విలువను చాటిన కేజీబీవీ విద్యార్థి
కురబలకోట : జిల్లా కేంద్రం రాయచోటి సాయి శుభా కళ్యాణ మండపంలో శనివారం అర్థరాత్రి వరకు జరిగిన జిల్లా స్థాయి వృత్తి వికాస ప్రదర్శనలో కురబలకోట కేజీబీవీ విద్యార్థిని దీపికకు జిల్లా స్థాయిలో గుర్తింపు లభించింది. ఆసుపత్రిలో వివిధ వృత్తుల నిర్వహణపై ఆమె ప్రతిభావంతమైన ప్రదర్శనతో జిల్లాలోనే మొదటి బహుమతి సాధించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఆసుపత్రి వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్లు, ఫార్మాసిస్టులు, రేడియాలజీ టెక్నిషియన్లు, వార్డుబాయ్స్, రిసెప్షనిస్టులు, అంబులెన్స్ అత్యవసర సేవలు, భద్రతా సిబ్బంది, అటెండర్, పారిశుధ్య కార్మికులు వంటి విభిన్న వృత్తుల ప్రాధాన్యతను చక్కగా ప్రదర్శించారు. దీంతో న్యాయ నిర్ణేతలతోపాటు అతిథులు ఈమెకు ప్రథమ బహుమతి ప్రదానం చేసి సత్కరించారు.
కబ్జాలను అడ్డుకోండి
సాక్షి టాస్క్‌ఫోర్స్ : బొమ్మవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1107, 1109లో అగ్రవర్ణాల వారు దళితుల భూములను లాక్కుని కబ్జాలకు పాల్పడుతున్నారని, ఆ గ్రామ దళితులు పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నారు. క్షేత్రస్థాయిలో విచారించి అర్హులైన వారికి న్యాయం చేయాలని అధికారులను దళితవాడ గ్రామస్తులు కోరుతున్నారు. దాదాపు నాలుగు ఎకరాల భూమిలో చదును చేసి బోరు కూడా వేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని న్యాయం చేయాలని దళితవాడ గ్రామస్తులు కోరుకుంటున్నారు.
ముగ్గురు మండీ
యజమానులకు నోటీసులు
గుర్రంకొండ : ప్రభుత్వ నిబంధనలను పాటించని ముగ్గురు టమాటా మండీల యజమానులకు నోటీసులు జారీచేశామని వాల్మీకిపురం మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరి చంద్రమౌళి, వైస్ చైర్మన్ నౌషాద్ అలీ తెలిపారు. ఆదివారం స్థానిక మార్కెట్‌యార్డు ఉప కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మార్కెట్ కమిటీ నిబంధనల మేరకు మార్కెట్ యార్డుకు 8 కిలోమీటర్ల పరిధి వరకు ఎవరూ కూడా ప్రైవేట్ టమాటా మండీలను నిర్వహించకూడదన్నారు. అలా నిర్వహించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటామన్నారు. మదనపల్లె మార్కెట్‌యార్డులో జాక్‌పాట్‌లను ఫూర్తిగా రద్దు చేశారన్నారు. ఇదే విధానాన్ని ఇక్కడి మండీల యజమానులు పాటించాలన్నారు. కమీషన్లు పదిశాతం బదులు నాలుగు శాతం మాత్రమే తీసుకోవాలన్నారు. వచ్చేనెల నుంచి 25 కేజీల టమాటా క్రీట్ల స్థానంలో 15 కేజీల క్రీట్ల విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ ఇన్‌చార్జి కార్యదర్శి సునీల్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆసుపత్రి వృత్తుల విలువను చాటిన కేజీబీవీ విద్యార్థి
ఆసుపత్రి వృత్తుల విలువను చాటిన కేజీబీవీ విద్యార్థి


