ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం
మదనపల్లె : దేశ అత్యున్నత రాజ్యాంగానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వల్ల ప్రమాదం ఏర్పడిందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మదనపల్లిలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు హాజరైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చెర్మన్ డాక్టర్ కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య మాట్లాడారు. దేశ సంపదను కార్పొరేట్ ముసుగు వేసుకున్న దోపిడిదారులకు అప్పగిస్తున్నారని, సహజ వనరులు నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని అన్నారు. ఆపరేషన్ కగార్ కేవలం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే అన్నారు. ప్రకృతి సంపదను అదానీకి దోచి పెట్టడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. కొంతమంది వంద సంవత్సరాల కాలంలో కమ్యునిస్టు పార్టీ ఏమి చేసిందని అంటున్నారని, ఈ దేశంలో ప్రజల హక్కులు అడిగే ధైర్యాన్ని ఇచ్చింది, ప్రజలకు పోరాట పాఠాలు నేర్పింది కమ్యునిస్టు పార్టీయే అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం సీపీఐ నేతలు ఎన్నో నిర్బంధాలు, కుట్ర కేసులు ఎదుర్కొన్నారని, ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారని వివరించారు. మోడీ ప్రభుత్వం ప్రజల ఆహారపు అలవాట్ల పైన, ధరించే దుస్తులపైన ఆంక్షలు విధిస్తూ, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతోందన్నారు. హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. రాజ్యాంగంలోని లౌకిక, సామ్యవాద అనే అంశాలను తొలగించే ప్రయత్నం చేస్తోందని, రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అర్‌ఎస్‌ఎస్, బీజేపీ నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత లౌకిక ప్రజాస్వామిక వాదులపైన ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు, జిల్లా కార్యదర్శి పి.మహేష్, సహాయ కార్యదర్శి టి. కృష్ణప్ప పాల్గొన్నారు.
ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లని ముద్ర వేస్తారా
సహజ సంపదను కొల్లగొట్టడానికే
ఆపరేషన్ కగార్
మదనపల్లె సదస్సులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సిపిఐ సెంట్రల్
కంట్రోల్ కమీషన్ చెర్మన్ నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య


