అన్నమయ్యకు అన్యాయం చేయొద్దు
రాజంపేట : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల ఖ్యాతిని నలుదిశలా ఇనుమడింప చేసేలా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లాకు అన్నమయ్య నామకరణం చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నమయ్య పేరు లేకుండా చేసేందుకు జరుగుతున్న ప్రతిపాదనలపై రాజంపేట ప్రాంతీయుల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.
108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద..
ఆదివారం సాయంత్రం 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద అన్నమయ్యకు అన్యాయం చేయవద్దంటూ చేసిన నినాదాలతో మార్మోగిపోయింది. రాజంపేట జిల్లా సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఉద్యమకారులు వినూత్న నిరసన తెలిపారు.
అన్నమయ్య చరిత్ర కనుమరుగుచేయకండి..
రాజంపేట పార్లమెంటరీ కేంద్రంతో పుట్టిందని, సాగునీరు, తాగునీరు పుష్కలంగా ఉందని న్యాయవాదుల జేఏసీ నేత కొండూరు శరత్‌కుమార్‌రాజు అన్నారు. ఆదివారం అన్నమయ్య ఉద్యానవనంలో మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య పేరును తీసేయాలని ఆలోచన నిజమైతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. అధికారుల మాటలను పక్కనపెట్టి, అన్నమయ్య సెంటిమెంట్‌ను గౌరవించి, పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు పూలభాస్కర్, ప్రభాకర్‌నాయుడు, సికిందర్, నందకిషోర్‌గౌడ్, చల్లా సుధాకర్, రెడ్డయ్య, గుత్తా లతచౌదరి, కేఎంఎల్ నరసింహులు, కొండూరు విశ్వనాథరాజు, శివరామరాజు, జీవీసుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
కళ్లకు గంతలు కట్టుకుని..
అన్నమయ్య పేరు లేకుండానే చేస్తున్నారంటూ ఉద్యమకారులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తంచేశారు. మోకాళ్లపై కూర్చుని వేడుకున్నారు.
అన్నమయ్య విగ్రహం వద్ద వినూత్న నిరసన


