గంజాయి ముఠా సభ్యుల అరెస్టు
గుర్రంకొండ : గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదుకేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొన్న సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ కథనం మేరకు గుర్రంకొండ పట్టణ పరిసరాల్లో గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయనే సమాచారం అందుకొన్న వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్‌ఐ రవీంద్రబాబుల ఆధ్వర్యంలోని రెండు వేర్వేరు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆదివారం గ్రామానికి సమీపంలో గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ముఠా సభ్యులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండలంలోని ఎల్లుట్ల పంచాయతీ పసలవాండ్లపల్లెకు చెందిన కనగాని వెంకటరమణ (40), స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన గుటం సమీర్ (20), గుర్రంకొండ పట్టణం ఎస్‌ఎల్‌టీ వీధికి చెందిన షేక్ మహమ్మద్ సైఫ్ (19), తరిగొండ పంచాయతీ ఇరగన్నగారిపల్లెకు చెందిన అరుణ్‌కుమార్ (19)లతో పాటు ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. వారి వద్ద నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ముఠా సభ్యులపై కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకొన్న గంజాయి విలువ రూ. లక్ష వరకు ఉంటుందన్నారు. గంజాయి ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకోవడంలో మంచి ప్రతిభ కనబరిచిన వాల్మికిపురం సీఐ రాఘవరెడ్డి, ఎస్‌ఐ రవీంద్ర, హెడ్‌కానిస్టేబుల్ నాగరాజనాయక్‌లను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు.


