ఒంటిమిట్టలో వైకుంఠ ఏకాదశికి పటిష్ట బందోబస్తు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు అన్నారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లను శనివారం టీటీడీ ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, విజిలెన్స్ సిబ్బందితో కలిసి ఒంటిమిట్ట సీఐ నరసింహారాజు, సిద్దవటం ఎస్‌ఐ రఫీ పరిశీలించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ..వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు స్వామి వారిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శించుకునేందుకు పటిష్ట భద్రత కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని టీటీడీ విజిలెన్స్ వారికి సూచించామన్నారు. ఇప్పటికే 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. దొంగ తనాలు నివారించేందుకు సివిల్ డ్రస్‌లో ఉన్న ప్రత్యేక క్రైమ్ పార్టీని ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసు కంట్రోల్ రూమ్ ఉంటుందన్నారు. డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలతో కలిపి దాదాపు 100 మంది బందోబస్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు.


