వరదరాజస్వామి విగ్రహాలు, కిరీటాలు అప్పగింత
రాజంపేట రూరల్ : అతి పురాతనమైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరదరాజస్వామి ఆలయంలోని పంచలోహ విగ్రహాలను, 3 వెండి కిరీటాలను ఆలయ వంశపారంపర్యకర్త అర్చకుడు మధురభారతం మాధవశర్మ దేవదాయశాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి నూకా సుబ్బారెడ్డికి అప్పగించారు. స్థానిక శ్రీఅభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో శనివారం జరిగిన కార్యక్రమంలో అర్చకుడు మాట్లాడుతూ పోలి గ్రామంలోని శ్రీవరదరాజస్వామి ఆలయంలో 150 సంవత్సరాలుగా తన ముత్తాత, తాత, తండ్రి, తాను వంశపారంపర్యంగా పనిచేశామన్నారు. ప్రస్తుతం కడపలో నివాసం ఉంటున్నందువలన అర్చకత్వానికి రాజీనామా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నూతన ప్రధాన అర్చకుడు పార్థసారథి, పోలి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


