పోలీసుల సాక్షిగా.. విధ్వంసం
కురబలకోట : మండలంలోని అంగళ్లు టెర్రకోట కళాకారుల ఇళ్లపై శుక్రవారం రాత్రి అమానుష దాడి జరగడం సంచలనంగా మారింది. అదీ హైవే పక్కనే మూకలు దాడికి తెగబడి రెండు ఇళ్లను ధ్వంసం చేసి ఇళ్లలోని సామగ్రి, బీరువాలను ఇతర వస్తువులను యథేచ్ఛగా బయట పడేయడం కలకలాన్ని సృష్టిస్తోంది. ఇదంతా పోలీసుల ఎదుటే జరగడం గమనార్హం. ఇందుకు సంబంధించి బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. అంగళ్లులోని హైవే పక్కనున్న కొత్త మసీదు పక్కన కుంట స్థలంలో ఎం. లక్ష్మి, ఎం. పార్వతి ఇళ్లు ఉన్నాయి. వీరి ఇళ్లకు సమీపంలో ఉన్న భాస్కర్ రెడ్డి వద్ద మూడేళ్ల క్రితం వీరు రూ. 7 లక్షలు అప్పుతీసుకున్నారు. వీరు ఇళ్లపై ఆయకం రిజిస్టర్ చేయించారు. సకాలంలో డబ్బులు చెల్లించక పోవడంతో వారి ఇళ్లు రిజిస్ట్రేషన్ అయినట్లు భాస్కర్ రెడ్డి చెబుతున్నారు. తాము రిజిస్ట్రేషన్ చేయలేదని దీంతో ఇళ్లు ఖాళీ చేయబోమని తేల్చి చెప్పారు. దీంతో ఇద్దరూ పరస్పరం కోర్టులో కేసులు నడుపుతున్నారు. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి వీరి ఇళ్లను బలవంతంగా ఖాళీ చేయించేందుకు పథకం వేశాడు. శుక్రవారం రాత్రి తనకు తెలిసిన వారితోపాటు మదనపల్లి, అనంతపురం నుంచి 30 మందికి పైగా కిరాయి మనుషులను రప్పించాడు. వీరంతా ఒక్కసారిగా గడ్డపారలు, కట్టర్లతో రెండు ఇళ్లపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇళ్లలోని పెద్దలు టెర్రకోట కుండలు, బొమ్మల అమ్మకానికి హైదరాబాదు ఎగ్జిబిషన్‌కు వెళ్లారు. ఇదే అదనుగా భాస్కర్ రెడ్డి ఇళ్లలోని పిల్లలను, బాలింత మమతను బయటకు ఈడ్చారు. ఇళ్లలోకి చొరబడి ధ్వంసం చేశారు. ఇళ్లలోని సామాన్లు బయట పడేశారు. ఇంటిపైన రేకులను ధ్వంసం చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు వచ్చినప్పటికీ దుండగులను అడ్డుకోలేకపోయారు. పైగా చూస్తూ ఉండిపోయినట్లు టెర్రకోట కళాకారులు చెబుతున్నారు. దీన్ని బట్టి పోలీసుల అండతోనే ఈ సంఘటన జరిగినట్లు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం దుండగులు తాపీగా వెళ్లిపోయారు. శనివారం ఉదయం బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భాస్కర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, వేణురెడ్డి, పాపులమ్మ, నందిని తదితరులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధు రామచంద్రుడు తెలిపారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా తాత్కాలికంగా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో పోలీసుల ప్రమేయం లేదన్నారు. సమాచారం తెలియగానే సంఘటన స్థలానికి వెళ్లి ఇరు వర్గాలను అడ్డుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు.
టెర్రకోట కళాకారుల ఇళ్లపై
రాత్రి వేళ మూకల దాడి
పిల్లలను, బాలింతను బయటకు
లాగి అరాచకం
కుటుంబ పెద్దలు హైదరాబాదు
ఎగ్జిబిషన్‌కు వెళ్లి ఉండగా ఘటన
పోలీసుల సాక్షిగా.. విధ్వంసం
పోలీసుల సాక్షిగా.. విధ్వంసం
పోలీసుల సాక్షిగా.. విధ్వంసం


