మహిళా మార్ట్‌లో చేతివాటం
వాల్మీకిపురం : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఉపాధి కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా మహిళా మార్టును ఏర్పాటు చేశారు. అయితే వాల్మీకిపురంలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్‌లో వెలుగు కార్యాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో నష్టాల బాట పట్టి మూసివేతకు సిద్ధంగా ఉన్నట్లు పలు విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. సిబ్బంది చేతివాటం వల్లనే మార్టు నష్టాల బాట పట్టిందని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం వ్యాపారాలు జరగకపోవడంతో నష్టాలు వస్తున్నాయని చెబుతుండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై శనివారం మహిళా డీపీఎం వెంకటరమణ మార్టులో తనిఖీలు నిర్వహించి, రికార్డులను పరిశీలించారు. విచారణ చేపట్టి, అక్రమాలు జరిగి ఉంటే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూ.27 లక్షలు మండలంలోని 900 మహిళా సంఘాల సభ్యుల నుంచి వసూలు చేసి మార్టును ఏర్పాటు చేశారని, తమ డబ్బులు తమకు ఇప్పించాలని డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
చైన్ స్నాచర్ అరెస్టు
కలికిరి : వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ కేసులో కర్నాటక రాష్ట్రం బెంగళూరు డీజే హళ్ళి ఏరియా మోదీ రోడ్డుకు చెందిన ఫైరోజ్‌ను కలికిరి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... కలికిరి పట్టణం క్రాస్ రోడ్డు చదివేవాండ్లపల్లిలో వృద్ధురాలు అరుణకుమారి ఒంటరిగా ఉంటోంది. ఈమె పిల్లలు ఉద్యోగ రీత్యా హైదరాబాద్, విశాఖపట్నంలో ఉంటున్నారు. ఒంటరిగా ఉన్న ఆమె మెడలో వేసుకున్న బంగారు చైనుపై పక్కింటిలో నివాసం ఉంటున్న అబ్దుల్లా కన్ను పడింది. బెంగళూరులో వుంటున్న తన స్నేహితుడు ఫైరోజ్‌ను ఈ నెల 6న కలికిరికి పిలిపించాడు. ఇల్లు బాడుగకు కావాలని వృద్ధురాలిని మాటల్లో దింపిన ఫైరోజ్ చాకచక్యంగా ఆమె మెడలోని బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్‌ఐ పీవీ రమణ దర్యాప్తు చేపట్టారు. సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, కలికిరి సీఐ రామచంద్ర సాంకేతికత సాయంతో నిందితుడు కర్నాటకు చెందిన ఫైరోజ్‌గా గుర్తించి అరెస్టు చేశారు. మరో నిందితుడైన కలికిరికి చెందిన అబ్దుల్లా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళా మార్ట్‌లో చేతివాటం


