ప్రాణం మీది.. భద్రత బాధ్యత మాది
● హెల్మెట్, సీటుబెల్టు ధరించండి..
సురక్షితంగా ఇంటికి చేరండి
● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
రాయచోటి : అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా వాహనదారులు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని శనివారం జిల్లా పోలీసు యంత్రాంగానికి సూచించారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ను, ఫోర్ వీలర్ నడిపేవారు సీటు బెల్టును భారంలా కాకుండా ప్రాణ రక్షణ కవచంలా భావించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవించి మరణాలలో అధికశాతం తలకు తగిలి తీవ్ర గాయాల వల్ల లేదా సీటుబెల్టు ధరించకపోవడం వల్ల వాహనం నుంచి బయటపడటం వల్ల జరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ఒక చిన్న నిర్లక్ష్యం కుటుంబం మొత్తాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తుందన్నారు. జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ పోలీసు స్టేషన్ల పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనదారులకు హెల్మెట్, సీటుబెల్టు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలన్నారు. వీలైన చోట్ల సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించి ప్రయాణాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఎస్పీ కోరారు.


