అప్పుల కుప్ప!
మదనపల్లె: జిల్లాలో 501 గ్రామపంచాయతీలు ఉండగా అందులో కేవలం పీలేరు, కలికిరి, గుర్రంకొండ, వాయల్పాడు, చింతపర్తి, కురబలకోట, నాగిరెడ్డిపల్లె, రైల్వేకోడూరు మాత్రమే మేజర్ పంచాయతీలుగా ఆదాయంలో ముందున్నాయి. అయితే ఈ పంచాయతీల్లో ప్రతి ఆర్థిక సంవత్సరం వసూలు చేయాల్సిన పన్నుల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఏటా కోట్లలో వసూలు చేయాల్సిన పన్నులే పంచాయతీలకు దన్నుగా నిలుస్తుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు అభివృద్ధి పనులకు, మౌలిక సౌకర్యాల కల్పనకు అండగా నిలుస్తున్నాయి. ఏటా ఆర్థిక వనరులను పెంచుకోవడం,వాటిద్వారా పంచాయతీల అభివృద్ధికి పాలన మండళ్లు శ్రద్ధ చూపించడం లేదు. దీనికితోడు వసూలు చేయాల్సిన ఇంటిపన్నుల విషయంలో అధికారుల చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. దీనివల్ల పంచాయతీల్లో పనులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికారులు పన్నుల వసూళ్లకు టార్గెట్‌లు ఇస్తున్నా వాటి ఫలితాలు మాత్రం ఉండడం లేదని తాజా అప్పుల లెక్క చెబుతోంది.
పీలేరుదే అగ్రస్థానం
పన్ను బకాయిల పెండింగ్, తాజా పన్నుల వసూళ్లలో జిల్లాలో పీలేరు అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో పాత బకాయిలు, 2025–26 ఆర్థిక సంవత్సర పన్నుల వసూళ్లు పడకేసినట్టు కనిపిస్తోంది. ఒక్క పీలేరు పంచాయతీలో పాత బకాయిలు రూ.122.95 లక్షలు ఉండగా తాజా పన్ను బకాయి రూ.228.75 లక్షలు. రెండు కలిపి రూ.3.51 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఇలాంటి పరిస్థితే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. వీరబల్లి మండలంలో మాత్రమే పాత, కొత్త బకాయిలు కలుపుకుని రూ.9.46 లక్షలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. పీలేరులో లాగే బకాయిలు పేరుకుపోతే పంచాయతీలు ముందుకువెళ్లే పరిస్థితులు లేవు.
ఆదాయంతోనే పనులు
పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీన్ అంబాసిడర్లకు వేతనాల చెల్లింపు, నీటి సరఫరా నిర్వహణ, బోర్ల నిర్వహణ ఇలాంటి పనులకు పంచాయతీకి వసూలయ్యే సాధారణ నిధులతోనే చేపట్టాల్సి ఉంటుంది. దీనికి పన్నులు సకాలంలో వసూలు కావాలి. లేదంటే నిధుల కోసం కటకటడాల్సిందే. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నా వాటిని దేనికోసం వెచ్చించాలో ప్రభుత్వమే సూచిస్తుంది కాబట్టి ఆ పనులే చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పంచాయతీల్లో నిధుల కొరత తీరాలంటే పన్నుల వసూళ్లపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.
అత్యధిక బకాయిలు
పంచాయతీల్లో పేరుకుపోయినపన్నుల వసూళ్లు
మార్చి ముంచుకొస్తున్నా కలెక్షన్లు నిల్
రూ.3.51 కోట్లతో పీలేరు టాప్,రూ.9.46 లక్షలతో వీరబల్లి లాస్ట్
పీలేరు రూ.351.7
కోడూరు రూ.178
మదనపల్లె రూ.183
రాజంపేట రూ.96.77
కురబలకోట రూ.80.47
కలికిరి రూ.73.69
చిట్వేలి రూ.58.01
అప్పుల కుప్ప!


