హెచ్చరికలు బేఖాతర్
ఒంటిమిట్ట: మండల పరిధిలోని పెన్నపేరూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 296లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిపై టీడీపీకి చెందిన గంగపేరూరు గ్రామంలోని ఓ నాయకుడి కన్ను పడింది. సుమారు ఎకరం వరకు చదును చేశారు. దీనిపై గత సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తప్పెటవారిపల్లికి చెందిన తప్పెట సుబ్బారెడ్డి స్థానిక రెవెన్యూ కార్యాలయంలో, కడప కలెక్టరేట్‌లోని డీఆర్వో విశ్వేశ్వరయ్యనాయుడుకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అక్కడ జరుగుతన్న ఆక్రమణలను రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, వీఆర్వో అంజయ్య నిలిపివేయించి, మళ్లీ అక్రమణలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఆక్రమణ దారుడిని హెచ్చరించారు. రెవెన్యూ వారు హెచ్చరించినా..తమ పార్టీ అధికారంలో ఉందనే ధీమాతో వారి హెచ్చరికను భేఖాతర్ చేసి బుధవారం అర్థరాత్రి ఎకరా ప్రభుత్వ భూమిని పూర్తిగా చదును చేశాడు. దీంతో తప్పెట సుబ్బారెడ్డి ఈ సమస్యను గురువారం మళ్లీ డీఆర్‌వో విశ్వేశ్వరయ్యనాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇది తెలుసుకున్న డీఆర్వో ఒంటిమిట్ట రెవెన్యూ అధికారులను ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా స్థానిక రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు దారుడు తప్పెట సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనిపై డీఆర్వో ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ప్రభుత్వ భూమిని చదును చేసిన
ఆక్రమణదారుడు


