22ఏ భూ సమస్యలపై స్పెషల్ డ్రైవ్
రాయచోటి: ప్రారంభం నుంచి పరిష్కారానికి నోచుకోని 22 ఏ చుక్కల భూముల సమస్యలపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. అనేక కారణాల వల్ల 22ఏ, చుక్కల భూములకు సంబంధించిన ఎన్‌ఓసీలు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. భూముల పరిష్కారంపై శుక్రవారం జిల్లా కలెక్టర్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా శుక్రవారం 22 ఎకరాల 62 సెంట్ల భూములకు సంబంధించిన ఎన్‌ఓసీలను జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మదనపల్లె మండలానికి చెందిన శ్రీలత, భాస్కర్, కానాల చెంగమ్మ, హేమలత, నందకిషోర్, కురబలకోట మండలానికి చెందిన మస్తాన్ రెడ్డిల భూములకు ఎన్‌ఓసీలను జారీ చేశామని పేర్కొన్నారు. మరో 15 ఎకరాల 28 సెంట్ల 22ఏ భూములకు సంబంధించి 10 కేసులను విచారణ చేపట్టామని, వీటికి సంబంధించిన ఎన్‌ఓసీలను సోమవారం జారీ చేస్తామన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 22ఏ చుక్కల భూముల సమస్యలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, త్వరలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రికార్డుల పోర్జరీ కేసులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వారు అన్నారు. ఎన్‌ఓసీలను పొందిన లబ్ధిదారులు కలెక్టర్, పాలన యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


