కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలు...అప్పులు...అనారోగ్యం వెరసి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం మదనపల్లె మండలంలో వెలుగుచూసింది. కోళ్లబైలు పంచాయతీ వైఎస్సార్ కాలనీకి చెందిన రామస్వామి, శివమ్మ దంపతుల కుమారుడు హరినాథ్(32)కు తంబళ్లపల్లె మండలం మూలపల్లెకు చెందిన గంగాదేవితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటూ జీవించేవారు. ఏడాది తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో నాలుగేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారు. బెంగళూరు నుంచి మదనపల్లెకు వచ్చిన హరినాథ్ తల్లిదండ్రులతో పాటు ఇంట్లోనే ఉండేవాడు. కొంతకాలంగా అనారోగ్యానికి గురై పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. ఆరోగ్యం మెరుగుపడలేదు. అంతేకాకుండా చికిత్స కోసం పలుచోట్ల అప్పులు చేశాడు. ఓ వైపు అనారోగ్యం, మరోవైపు కుటుంబ సమస్యలు, భార్య లేక ఒంటరితనం తదితర కారణాలతో మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించారు. ఈలోపుగా హరినాథ్ భార్య గంగాదేవి తన భర్త మృతి చెందడంపై తనకు అనుమానం ఉందంటూ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు మృతుడి భార్య గంగాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళావెంకటరమణ తెలిపారు.


