రాజకీయ కుట్రలో భాగమే డీకే.శ్రీనివాస్, కల్పజ అరెస్ట్
మదనపల్లె రూరల్ : మాజీ ఎంపీ, పారిశ్రామిక వేత్త డీకే.ఆదికేశవులునాయుడు కుమారుడు డీకే.శ్రీనివాసులు, కుమార్తె కల్పజ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని పారిశ్రామిక వేత్త అమరనాథ్ స్పష్టం చేశారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా అనేక బృహత్తర కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందిన ఆదికేశవులునాయుడు గురించి తెలియని వారు లేరన్నారు. స్థానికంగా చిత్తూరు వాస్తవ్యులైనప్పటికీ, వ్యాపారరీత్యా ఆదికేశవులునాయుడు కుటుంబం బెంగళూరులో స్థిరపడిందన్నారు. ఆరేళ్లక్రితం డీకే.శ్రీనివాసులు వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న రఘునాథ్ వారి ఇంటిలో చనిపోతే, ప్రస్తుతం రాజకీయ కుట్రతో ఆ మరణాన్ని వారికి అంటగడుతున్నారని ఆరోపించారు. వారితో 30 ఏళ్లుగా ఉన్న డ్రైవర్‌ను చంపాల్సిన అవసరం వారికి లేదని, అతని ఇంట్లోనే సహజంగా చనిపోయాడని పోలీసులు, కోర్టు నిర్ధారించినా తిరిగి వారిపై విషం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. సమావేశంలో డీకే.ఆదికేశవులునాయుడు అభిమానులు రాయల్ గణి, గట్టు చంద్రశేఖర్, గల్లా భాస్కర్, నసీబ్, నరేష్‌నాయుడు, సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


