జిల్లా కోసం చేపట్టే ఉద్యమానికి సంఘీభావం
రాజంపేట: రాజంపేట జిల్లా కేంద్రం కోసం చేపట్టే ఏ ఉద్యమానికై నా నా సంఘీభావం ఎల్లప్పుడూ ఉంటుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. రాజంపేట అంబేడ్కర్ సర్కిల్‌లో 20రోజుకు చేరుకున్న అన్నమయ్య జిల్లా సాధనసమితి ఆధ్వర్యంలో మన్నూరు(రాజంపేట పట్టణం) వాసులు చేపట్టిన రిలేనిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్ధితుల్లో విమర్శలు అనవసరమనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.తాను రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదని స్పష్టంచేశారు. రాజంపేట ప్రాంత వాసిగా తనకు కూడా రాజంపేట జిల్లా కేంద్రం కావాలనే ఉంటుందని వివరించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషిచేయాలన్నారు. కొత్త జిల్లాలో ఏర్పాటు క్రమంలో మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటిలను కలిపి అన్నమయ్య జిల్లాకు భౌగోళికపరంగా ఆలోచించి కేంద్రంగా ఆనాడు రాయచోటిని ఏర్పాటుచేయడం జరిగిందనేది అందరికి తెలిసిందేనన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మదనపల్లె జిల్లాను ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత ఇప్పుడు ఏర్పడిన భౌగోళిక పరిస్ధితుల నేపథ్యంలో కేంద్రబిందువుగా రాజంపేటను చేయాలని ఇక్కడి ప్రాంతీయులు మనోగతమే ఉద్యమరూపంలా కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజంపేట ఎన్నికల సభలో రాజంపేటను జిల్లాకేంద్రంగా మారుస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని ఇక్కడి ప్రజలు ప్రస్తావిస్తున్నారన్నారు. ప్రజల మనోగతాన్ని అనుసరించి ఎన్నికల హామీని నెరవేర్చాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు.
చేతనైతే జిల్లా తీసుకుండి:
మున్సిపల్ వైస్ చైర్మన్ సవాల్
దీక్షా శిబిరంలో రాజంపేట మున్సిపల్ వైస్‌చైర్మన్ మర్రి రవికుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రమే మన ధ్యేయమనేది గుర్తుపెట్టుకోవాలన్నారు. కొంతమంది రాజకీయంగా నీచంగా దిగజారిపోతున్నారన్నారు. గతంలో కూడా చెప్పామన్నారు. ప్రభుత్వంలో ఉండేది మీరు.. చేతనైతే జిల్లా కేంద్రం తీసుకురావాలన్నారు. ప్రజలను తప్పుదోవపట్టించేందుకు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. పోరాటం నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టిందన్నారు. జిల్లా సాధించే వరకు పోరు సాగిస్తానన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీనేత, వడ్డెర సంఘం రాష్ట్రనాయకుడు వడ్డె రమణ మాట్లాడుతూ ఇప్పుడు కావాల్సింది, చేయాల్సింది రాజకీయ విమర్శలు కాదని హితవు పలికారు. మన్నూరుకు చెందిన వడ్డెరసంఘం నేత రమణ,రసూల్,కళ్యాణ్, బాలాజీ, బోనం పిచ్చయ్య, పిడుగుమల్లి, వెంకటసుబ్బారెడ్డి, నాగరాజు, నరసింహులు,గల్లా హరిప్రసాద్, ఉమ్మడి శివశంకరయ్య,చిన్నయ్య, నరసింహులతోపాటు సౌమ్యనాథాలయ మాజీ చైర్మన్ అరిగెల సౌమిత్రి, క్షత్రియ సంఘం నేత జీవీసుబ్బరాజు పాల్గొన్నారు.
ఎన్నికల సభలో సీఎం ప్రకటించిన హామీ నెరవేర్చుకోవాలి
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి


