కరెంట్ షాక్‌తో బాలికకు తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : ఇంటిమిద్దైపె ఆడుకుంటుండగా, 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి నాలుగో తరగతి చదువుతున్న బాలిక తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. కోళ్లబైలు పంచాయతీ జగన్‌కాలనీలో నివాసం ఉంటున్న ఆనంద, శ్రావణి దంపతుల కుమార్తె రెడ్డిప్రసన్న(10) స్థానికంగా నాలుగో తరగతి చదువుతోంది. గురువారం క్రిస్మస్ సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో అదే వీధిలోని నిర్మలమ్మ ఇంటి మిద్దైపె తోటిపిల్లలతో కలిసి ఆడుకుంటుండగా, మిద్దైపె తక్కువ ఎత్తులో ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు విద్యార్థినికి తగలడంతో షాక్‌కు గురై తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే బాలికను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. విద్యుత్ ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతున్నా ఆ శాఖ అధికారులు నివారణ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.


