ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సుండుపల్లె : అక్రమంగా తరలిస్తున్న 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి అటవీ శాఖ రేంజ్ అధికారి వై.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వివరాలిలా.. రాయవరం సెక్షన్ వానరాచపల్లె బీట్ పరిధిలోని తాటిమానుపెంట ప్రదేశంలో ఎర్రచందనం అక్రమ రవాణా అవుతోందనే సమాచారం రావడంతో అటవీ శాఖ సిబ్బంది రాత్రి 9 గంటల సమయంలో ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ అశోక్ లేలాండ్ దోస్త్ (టీఎన్ 92జే 1679) వాహనం వీరికి ఎదురుగా వస్తుండగా వాహనంలోని ఇద్దరు వ్యక్తులు అటవీశాఖ సిబ్బందిని గుర్తించి కిందకు దూకారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పొదలలో పారిపోయారు. వాహనాన్ని పరిశీలించగా అందులో 1205 కేజీల బరువున్న 30 ఎర్రచందనం దుంగలున్నాయి. వాహనాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ.11,82,620, వాహనం విలువ రూ.4 లక్షలు ఉంటుందని సానిపాయి రేంజ్ అధికారి తెలిపారు. ఈ తనిఖీలో రాయవరం డీవైఆర్‌ఓ రమేష్‌బాబు, సానిపాయి స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.


