తప్పిపోయిన పది నిమిషాల్లోనే తల్లిదండ్రులకు అప్పగింత
రాయచోటి టౌన్ : తప్పిపోయిన పది నిమిషాల్లోనే రాయచోటి పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన రాయచోటిలో జరిగింది. గురువారం రాయచోటి పట్టణంలోని మహబూబ్ బాషా వీధికి చెందిన బి. నాగార్జున కుమారుడు శ్రీహాన్ ఉదయం ఇంటిలో నుంచి ఆడుకుంటూ వీధిలోకి వెళ్లాడు. అటు నుంచి వీధి వెంట వెళ్లిపోయిన చిన్నారి శ్రీహాన్ కనిపించలేదు. కాస్త ఆలస్యంగా ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అర్బన్ సీఐ బీవీ చలపతి తన సిబ్బంది ఎస్‌ఐ జాహీర్, కానిస్టేబుల్ పవన్‌కుమార్, దామోదర్‌లను వెంటనే అప్రమత్తం చేసి గాలింపునకు పంపారు. ఆదేశాలు అందుకున్న పోలీసులు వీధి వీధి గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని మటన్ కొట్టు వ్యాపారి వద్ద ఆ బాలుడు ఏడుస్తూ కనిపించడంతో విషయం తెలుసుకొని ఆయన వద్దకు వెళ్లి ఆ బాలుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.


