ఘనంగా క్రిస్మస్ వేడుకలు
రాయచోటి: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని రాయచోటి, మదనపల్లి, పీలేరు, కోడూరు, రాజంపేట, తంబళ్లపల్లి నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండలాలు, గ్రామీణ ప్రాంతాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏసుక్రీస్తును కొలుస్తూ భక్తులు ఆలపించిన దైవభక్తి గీతాలు అలరించాయి. ఈ సందర్భగా పాస్టర్లు ఏసుక్రీస్తు జన్మదిన విశిష్టతను వివరించారు. పలు రాజకీయ పార్టీల నేతలు చర్చిలకు వెళ్లి కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుబాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా రాజంపేటలోని చర్చిలో శాసనసభ్యులు ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వాయల్పాడు సీహెచ్ చర్జిలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రైల్వేకోడూరులోని లూథరన్ చర్చి, రెడ్డివారిపల్లి చర్చిలో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రాయచోటిలోనే బేథాల కాలనీ చర్చిలో మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మదనపల్లిలో పురాతన సిహెచ్‌ఐ, లూథరన్, హలలూయ చర్చిలలో నియోజకవర్గ ఇన్‌చార్జి నిస్సార్ అహ్మద్ పాల్గొని ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలతో కలిసి నిస్సార్ అహ్మద్ కేక్‌లు కట్ చేసి సంబరాలలో పాలు పంచుకున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలో స్థానిక నాయకులు క్రిస్మస్ వేడుకలలో పాల్గొని పాస్టర్లు ఇచ్చిన సందేశాలను విన్నారు.
చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు


