● ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పరిహాసమైన ప్రజాస్వామ్యం.. ● బరితెగించిన పచ్చ మూక.. రాయచోటి రౌడీల వీరంగం
సాక్షి రాయచోటి/రాజంపేట: ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌లో రిగ్గింగ్ యథేచ్ఛగా సాగింది. మండలంలో 30 పోలింగ్ బూత్‌లు ఉంటే ప్రతి చోట పోలీసులు, ఎన్నికల సిబ్బంది సహకారం ఎల్లో గ్యాంగ్‌కు లభించింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు నేరుగా పోలింగ్ బూత్‌ల్లోకి చొరబడి, ఓటర్ల నుంచి ఓటరు స్లిప్‌లు లాక్కుని వారే ఓటు వేసుకున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులు, అధికారులు మిన్నకుండిపోయారు.
మంత్రి నేతృత్వంలో
వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులు
మంత్రి మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో టీడీపీ శ్రేణులు.. పోలింగ్ బూత్‌లలో వున్న వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులు చేశారు. ప్రధానంగా మంటంపంపల్లె, చిన్నకొత్తపల్లె, గంగపేరూరు, నడింపల్లె తదితర పోలింగ్ బూత్‌లలో ఉదయం నుంచి ఏజెంట్లను బయటికి లాగి పడిసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సంఘటనలతో పోలింగ్ బూత్‌ల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
అడ్డుకోవడానికి వైఎస్సార్‌సీపీ నేతల యత్నం
సమాచారం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి, ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ గోవింద్‌రెడ్డిలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పోలింగ్ బూత్ వద్దకి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ నేతల దౌర్జన్యానికి అడ్డుతగులుతున్నారని భావించి.. వైఎస్‌ఆర్‌సీపీ నేతలను అరెస్ట్ చేయాలని పోలీసులకు అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతలను అరెస్ట్ చేసి ఒంటిమిట్ట, కడప రిమ్స్, చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. తరువాత సాయంత్రం విడుదల చేశారు.
బౌన్సర్లతో టీడీపీ నేతలు హల్‌చల్
అధికార పార్టీ నేతలు తమ వెంట తెచ్చుకున్న బౌన్సర్లతో పోలింగ్ బూత్‌ల వద్ద హల్‌చల్ చేశారు. టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, మరికొందరి నేతల వెంట బౌన్సర్లు కనిపించడం వివాదానికి దారి తీసింది.
ఓటు హక్కును కోల్పోయిన ఒంటిమిట్ట వాసులు
జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో ఒంటిమిట్ట వాసులు ఓటు హక్కును కోల్పోయారు. పోలింగ్ బూత్‌లలో కూడా ఓటు వేసే పత్రాలను సిబ్బంది, పచ్చమూకలు కలిసి.. పోలీసులు సహకారంతో ఇతరుల ఓటును టీడీపీ అభ్యర్థికి వేసుకున్నారు. అడిగితే దౌర్జన్యంగా పోలీసు సహకారంతో బయటికి పంపించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓటు తమ చేతిలో లేకుండా పోయే సరికి పలువురు పోలింగ్ బూత్‌ల వద్ద ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందంటూ పెదవి విరిచారు.
రాయచోటి రౌడీలపై ఆగ్రహం
పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్న ఒంటిమిట్టలో రాయచోటి రౌడీల వీరంగంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్కృతిని తీసుకొచ్చిన పచ్చనేతల తీరుతెన్నులపై విరుచుకు పడుతన్నారు. బయటి వారిని రప్పించి, దౌర్జన్యం చేసిన సంఘటనలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిపై ఒంటిమిట్టలోని అన్ని సామాజికవర్గ ఓటర్లలో సానుభూతి పెరిగింది. ఇలాంటి సంస్కృతి ఇక్కడ అక్కర్లేదని కొంత మంది పచ్చనేతలు తీరుతెన్నులపై విరుచుకు పడుతన్నారు.
పులివెందులలో
విష సంస్కృతికి బీజం
సాక్షి టాస్క్‌ఫోర్స్: జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో విష సంస్కృతి బట్టబయలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు జరిగాయి. వేలాది మంది టీడీపీ అల్లరి మూకలవల్ల ఓటర్లు, ఏజెంట్లు భయబ్రాంతులకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లి పోలింగ్ బూత్‌లను మంగళవారం టీడీపీ మూకలు ఆక్రమించుకున్నారు. అలాగే టీడీపీ నాయకులు సాక్షి వాహనాన్ని చుట్టుముట్టి వాహనాన్ని బాది తాళాలు లాక్కొన్నారు., చొక్కా పట్టి కిందకు దించే ప్రయత్నం చేశారు. కొత్తపల్లిలో ‘సాక్షి’ మీడియా వాహనాలు ధ్వంసం చేశారు. ఎర్రిపల్లె, కొత్తపల్లెల్లో వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆనంద్‌పై టీడీపీ అల్లరి మూకల దాడి చేశారు. తుమ్మలపల్లె, కనంపల్లెలలో కట్టెలు పట్టుకుని టీడీపీ మూకలు గొడవలు చేశారు. తుమ్మలపల్లెలో షామియానా వేసి టిఫిన్, భోజనాలు ఏర్పాటు చేశారు. అచ్చివెళ్లిలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను టీడీపీ నాయకులు అడ్డుకున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. మోట్నూతలపల్లెలో టీడీపీ మూకలు వైఎస్సార్‌సీపీ వాహనాలను ధ్వంసం చేశారు. కొత్తపల్లె, నల్లగొండువారిపల్లె, తుమ్మలపల్లె పోలింగ్ బూత్‌లలోకి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించకుండా ఆక్రమించుకున్నారు. ఎర్రిపల్లెలో పోలింగ్ బూత్‌ను ఆధీనంలోకి తీసుకుని ప్రజలు వెళ్లకుండా అడ్డుకున్నారు.
వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసింగ్ ఫెయిల్యూర్ అయింది. ఈ రెండు స్థానాల్లో పేరుకు మాత్రమే పోలీసు అధికారులు, సిబ్బందిని కలిపి దాదాపు 1400 మందిని బందోబస్తు విధులకు నియమించినట్లు ఉన్నతాధికారులు ప్రచారం చేశారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిఘా వుంచామని ఆర్భాటంగా చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయప్రవీణ్, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి పకడ్బందీగా బందోబస్తు విధులను నిర్వహిస్తున్నామని ప్రచారం చేసుకున్నారు. కానీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సమయంలో మాత్రం టీడీపీ వారికే వత్తాసు పలుకుతూ, వారు ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, దాడులకు తెగబడినా కేవలం ప్రేక్షకపాత్రను పోషించారనే చెప్పవచ్చు.
ఒంటిమిట్ట మండలంలోని 30 పోలింగ్ కేంద్రాలలో ఉదయం సాఫీగా ప్రారంభమైన పోలింగ్ 10 గంటల సమయం నుంచి సీన్ మారిపోయింది. టీడీపీ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, టీడీపీ రాజంపేట నియోజకవర్గ నాయకుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఏజెంట్లను బెదిరించి బయటికి పంపించారు.
పోలీసింగ్ ఫెయిల్యూర్
పోలీసింగ్ ఫెయిల్యూర్