
నేడు హుండీ ఆదాయం లెక్కింపు
సిద్దవటం: మండల పరిధి వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించనున్నట్లు ఈఓ శ్రీధర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆలయ ఆవరణలో దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించడం జరుగుతుందన్నారు. కావున ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.
ఈ– క్రాప్ నమోదు
చేసుకోవాలి
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): పంట సాగు చేసిన ప్రతి రైతు ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని అన్నమయ్య జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ తెలిపారు. రామాపురం మండలం చిట్లూరు గ్రామంలో మంగళవారం రైతు సేవా కేంద్ర సిబ్బంది ఈ క్రాప్ చేస్తున్న ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట నష్టం, ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ రాయితీలు, ఏమి రావాలన్నా ఈ క్రాప్ చేయించుకోవాలన్నారు. ఈ క్రాప్ చేసుకోని రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అమలు కావన్నారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు జయరాణి, మండల వ్యవసాయాధికారి నాగమణి, ప్రభావతి, రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
జగనన్న కాలనీ, డంపింగ్ యార్డు పరిశీలన
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): రామాపురం మండల కేంద్రంలోని డంపింగ్ యార్డు, జగనన్న కాలనీలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డులో చెత్తసేకరణ చేయాలని, అలాగే డంపింగ్‌యార్డును పరిశుభ్రంగా ఉంచాలని స్థానిక సర్పంచ్ నాగభూషణ్‌రెడ్డి, పంచాయతీ సెక్రటరీ ఓబులమ్మలకు సూచించారు. చెత్త సేకరణ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన జరుగుతున్నదని, చుట్టుపక్కల ఉన్న పొడి, తడి చెత్తనలు వేరుగా చేయించాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని పరిసరాల్లో సేకరించిన చెత్తను తప్పకుండా డంపింగ్‌యార్డుకు వచ్చే విధంగా చర్యలు చే పట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం నల్లగుట్టపల్లి గ్రామంలోని హౌసింగ్ కాలనీని ఆయన పరిశీలించి మండలంలో పూర్తి కాని గృహాలను పూర్తి చేయించాలని హౌసింగ్ ఏఈకి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగభూషణ్‌రెడ్డి, ఎంపీడీఓ జాషువా, హౌసింగ్ ఏఈ కేఎన్‌ఎం ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ కృపావతి, ఆర్‌ఐ సమ్మద్‌ఖాన్, వీఆర్‌ఓ రాధిక, ఏపీఓ పెంచలయ్య, పంచాయతీ కార్యదర్శి ఓబులమ్మ, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
అభ్యాసంతో నైపుణ్యాభివృద్ధి
రాయచోటి జగదాంబసెంటర్: అటల్ టింకరింగ్ ల్యాబ్‌లలో అభ్యాసం కల్పించి విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందింపచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం సూచించారు. మంగళవారం కలకడ మండలం బాటవారిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా టింకరింగ్‌డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్నమయ్య జిల్లాలోని అన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్‌లలో మెగా టింకరింగ్ డే నిర్వహించామని తెలిపారు. నిపుణుల ప్రత్యక్ష ప్రమేయం లేకుండా ప్రాజెక్టులను రూపొందించడం నేటి కార్యక్రమం ప్రత్యేకమని అన్నారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని అనుసరించి అటల్ టింకరింగ్ ల్యాబ్‌లలో విద్యార్థులు వ్యాక్యూమ్ క్లీనర్లను రూపొందించారని అన్నారు. ఇలాంటి స్వయం అభ్యాస కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఉపయోగపడే నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నారని అన్నారు. జిల్లాలోని అన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్‌లలో ప్రతి వారం ఇలాంటి తరగతులు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆయన డీవార్మింగ్ డే నిర్వహణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటసుబ్బయ్య, అటల్ ల్యాబ్ ఇన్‌చార్జి టీచర్ శేఖర్‌బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

నేడు హుండీ ఆదాయం లెక్కింపు