
అన్నదాత సుఖీభవ కోసం వెళ్తూ.. వృద్ధురాలి మృతి
మదనపల్లె రూరల్ : అన్నదాత సుఖీభవ పథకంలో డబ్బులు పడలేదన్న విషయమై ఆందోళన చెందుతూ, ఎందుకు పడలేదో కనుక్కునేందుకు సచివాలయానికి బయలుదేరిన వృద్ధురాలు ఆటో బోల్తా పడటంతో మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. మదనపల్లె మండలం బొమ్మనచెరువు పంచాయతీ టేకులపాలెం పందివారిపల్లెకు చెందిన పగడాల వెంకటరమణ భార్య చిన్న పాపమ్మ (66) తనకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా నిధులు అందకపోవడంతో, ఈ విషయమై సచివాలయానికి బయలుదేరింది. టేకులపాలెం వద్ద రామసముద్రం మండలం అజ్జిరెడ్డిగారిపల్లెకు చెందిన రామిరెడ్డి ఆటోలో ఎక్కింది. ఆటో బొమ్మనచెరువుకు వస్తుండగా, మార్గమధ్యంలోని లాభాల గంగమ్మ గుడికి సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా బొలేరో వాహనం రావడంతో, వాహనాన్ని తప్పించేందుకు ఆటోను పక్కకు తిప్పగా అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ఉన్న చిన్న పాపమ్మ కిందపడి తీవ్రంగా గాయపడింది. ఆటో డ్రైవర్ రామిరెడ్డి సైతం స్వల్పంగా గాయపడడంతో గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలోని వైద్యులు పరీక్షించి చికిత్స అందించే లోపే చిన్నపాపమ్మ పరిస్థితి విషమించి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు.